AP ZP Chairman Election జెడ్పీల్లోనూ ‘సామాజిక’ రెపరెపలు

YSRCP Clean Sweep In ZP Chairmen And Vice Chairman Election - Sakshi

13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌లుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

వైస్‌ చైర్మన్, చైర్‌పర్సన్లుగా కూడా ఆ పార్టీ వారే

జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవుల్లోనూ సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం

ఒక రాష్ట్రంలో అన్ని జెడ్పీలను ఒకే పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడం దేశంలో ఇదే తొలిసారి

జనరల్‌కు కేటాయించిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవులూ బీసీలకు కేటాయింపు

తొమ్మిది జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఛాన్స్‌

26 వైస్‌ చైర్మన్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో 20 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే..

ఏడు జెడ్పీ చైర్‌పర్సన్‌లుగా.. 15 జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌లుగా మహిళలకు అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. 13 జిల్లాల జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. రాజకీయాల్లో సామాజిక విప్లవం సృష్టిస్తున్న ఆ పార్టీ మరోసారి జెడ్పీ పదవుల్లోనూ రెపరెపలాడించింది. ఇక ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఒకే పార్టీ చేజిక్కించుకోవడం దేశంలో ఇదే తొలిసారి.

ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్‌సీపీ 630 జెడ్పీటీసీ స్థానాల్లో చారిత్రక విజయం సాధిం చింది. విపక్ష పార్టీలైన టీడీపీ కేవలం ఆరు, జనసేన రెండు, సీపీఎం 1, ఇతరులు ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి. కో–ఆప్షన్‌ సభ్యుల పదవులకూ శనివారం  ఎన్నికలు నిర్వహించారు. ఇందులోనూ అన్ని పదవులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


 

ఇదీ సామాజిక న్యాయమంటే..
జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా తొమ్మిది కేటాయించారు. అలాగే..
విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్‌ పదవులను జనరల్‌ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు.

కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ (మహిళ)కు ప్రభుత్వం రిజర్వు చేస్తే.. ఆ పదవిని బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు.

ఇలా జనరల్, జనరల్‌ (మహిళ) విభాగాలకు ప్రభుత్వం రిజర్వు చేసిన మూడు జెడ్పీ అధ్యక్ష పదవుల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక ఢంకా మోగించారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు.. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 26 ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 20 పదవులను కేటాయించారు. మిగిలిన ఆరింటిలో ఓసీలకు అవకాశం కల్పించారు.

అంతేకాక.. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లుగా ఏడుగురికి.. వైస్‌ చైర్‌పర్సన్‌లుగా 15 మంది మహిళలకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి పెద్దపీట వేశారు.

ఇక రాష్ట్రంలో 620 ఎంపీపీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 67 శాతం, ఓసీలకు 33 శాతం పదవులను కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో ఏకంగా 64 శాతం (397) పదవులను మహిళలకు కేటాయిస్తే.. 36 శాతం (223) పదవులను పురుషులకు కేటాయించారు.

‘జనరల్‌’లో బీసీలకు అవకాశం
విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్‌ పదవులను జనరల్‌ విభాగానికి ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ, ఆ రెండింటినీ బీసీ వర్గాలకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, గోవిందప్ప శ్రీనివాసులుకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ (మహిళ)కు రిజర్వు చేస్తే..  బీసీ మహిళ ఉప్పాల హారికకు పట్టంగట్టారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top