తాడేపల్లి: భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియదన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. ఈరోజు(గురువారం, జనవరి 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు సర్వేలో అసలు సర్వే రాళ్లు లేవన్నారు.
‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్ బుక్‌ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే. ట్యాంపర్ చేయలేని పాస్‌బుక్‌లు ఇవ్వాలన్నదే మా తపన. పైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి.
కమీషన్లు తీసుకుని పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తున్నారు. 22ఏ గురించి బాబు మాట్లాడం ఆశ్చర్యమేస్తోంది. 22ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుది. 35లక్షల 40 వేల ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించాం. 27.40 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పించాం. చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాం. రూ. 55.79కు మేం పట్టాదార్ పాస్‌బుక్ ఇస్తే.. చంద్రబాబు రూ. 76కు పాస్‌బుక్ ఇస్తున్నారు.
మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్ వ్యవహారం. సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్’ అని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.
ఇవీ చదవండి:
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్.. హైలైట్స్
చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?


