మండలిలో పూర్తి మెజార్టీ దిశగా వైఎస్సార్‌సీపీ

YSR Congress Party towards an absolute majority in Legislative Council - Sakshi

మండలిలో పూర్తి మెజార్టీ దిశగా వైఎస్సార్‌సీపీ 

ఎమ్మెల్యేల కోటాలో 3, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు 

14 స్థానాలూ ఖాయంగా అధికార పార్టీకే 

మండలిలో 18 నుంచి 32కు పెరగనున్న బలం 

ప్రజాభ్యుదయ నిర్ణయాలపై ప్రభుత్వానికి మరింత వెసులుబాటు 

రెండున్నరేళ్లు సైంధవుడిలా అడ్డుపడ్డ చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే శాసనమండలిలో అధికార వైఎస్సార్‌సీపీ సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శాసనసభ, స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే 14 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. అప్పుడు మండలిలో వైఎఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. శాసనసభ తరహాలోనే శాసనమండలిలోనూ వైఎస్సార్‌సీపీకి తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది. దీనివల్ల ప్రజాభ్యుదయం, రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి ప్రభుత్వానికి మరింత వెసులుబాటు ఉంటుందని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాసనమండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి రెండున్నరేళ్లుగా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు తెర పడుతుందని పేర్కొంటున్నారు. 

బిల్లులకు మోకాలడ్డు.. 
చట్టసభలను ప్రతిపక్ష నేత చంద్రబాబు తన క్షుద్ర రాజకీయాలకు వేదికగా మార్చుకున్నారు. అందరి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శాసనసభలో చర్చించి ఆమోదించిన చారిత్రక బిల్లులను శాసనమండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని మోకాలడ్డారు. చట్టాలు రూపు సంతరించుకోవడంలో తీవ్ర జాప్యమయ్యేలా చేసి ప్రజాభ్యుదయాన్ని కాలరాయాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధించడం ద్వారా పేద పిల్లలకు బంగారు భవిత అందించడమే లక్ష్యంగా తెచ్చిన బిల్లు నుంచి రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు వరకూ శాసనసభ ఆమోదించిన వాటిని మండలిలో సంఖ్యాబలంతో అడ్డుకునేందుకు పన్నిన కుట్రలే అందుకు నిదర్శనం. ఎస్సీలు, ఎస్టీల కోసం వేర్వేరుగా కమిషన్‌లు ఏర్పాటు చేయడానికి వీలుగా శాసనసభ ఆమోదించిన బిల్లునూ మండలిలో అడ్డుకునే దుస్సాహసానికి ఒడిగట్టారు.  

పూర్తి ఆధిక్యం దిశగా.. 
స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 11 మంది, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియడంతో శాసన మండలిలో టీడీపీ సంఖ్యాబలం తగ్గింది. ఖాళీ అయిన 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శాసనసభలో వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి మండల, జిల్లా పరిషత్‌లలో 86 శాతం ఎంపీటీసీ, 98 శాతం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. నగర, పురపాలక సంస్థల్లో 82.80 శాతం డివిజన్లు, వార్డుల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అటు శాసనసభ ఇటు స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు నిర్వహిస్తున్న 11 ఎమ్మెల్సీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం ఖాయం. శాసనమండలిలో సంపూర్ణ ఆధిక్యం సాధించడం ద్వారా విపక్షం కుట్రలకు అడ్డుకట్ట పడనుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top