
సాక్షి, గుంటూరు: రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులపై నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి అవగాహన లేదా? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో.. గుడివాడ జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దాడి ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్‌లు పెట్టుకోవడం.. ఇవన్నీ హక్కులే కదా. మరి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలీదా? అని జగన్ ప్రశ్నించారు.
గుడివాడలో దాడిని రాష్ట్రం మొత్తం చూసింది. మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి చేశారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం. నా సోదరి హారిక మీద టీడీపీ సైకోలు దాడి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటే.. పోలీసుల సమక్షంలో ఇది జరిగింది. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక బీసీ మహిళకు ఆత్మగౌరవం లేదా?.. ఇంతమంది సైకోలుగా, శాడిస్టులుగా ప్రవర్తిస్తారా?.. పథకం పన్ని నా చెల్లి హారికపై చేసిన దాడి దుర్మార్గం.
హరికను అనకూడని మాటలు అన్నారు. మళ్లీ మహానటి అంటూ ఆమెనే ఎద్దేవా చేస్తున్నారు. దానవీరశూరకర్ణ కంటే గొప్పగా నటించేంది చంద్రబాబే. స్పష్టంగా ఆధారాలు ఉంటే ఎంత మంది మీద కేసు పెట్టారు?. తిరిగి హారిక భర్త రాము మీదే తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబు ఈ విషయమై అడుగుతున్నా.. పెడనలో సభ పెట్టిన వైఎస్సార్‌సీపీ నేతలందరిపై కేసు పెట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకా ఎక్కడైనా ఉన్నామా?. చంద్రబాబు చేసే ప్రతిపనిలో డైవర్షన్ పాలిటిక్సే అని జగన్ అన్నారు.
