గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని అన్నారాయన. గురువారం సాయంత్రం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నా పాదయాత్రలో కష్టాలను చూశా. అందుకు తగ్గట్లు.. గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికి మంచి చేశాం. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం.
..కూటమి పాలనలో తిరోగమనంలో ఇప్పుడు రాష్ట్రం ఉంది. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. బడ్జెట్‌తో భరోసా ఇవ్వలేకపోయారు. లిక్కర్, ఇసుక స్కాంలతో పాటు.. ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి..
రాష్ట్రంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అడుగులు వెనక్కు పడుతున్నాయి. సూపర్ సిక్స్‌లు కనిపించవు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించవు. రెడ్‌బుక్ పరిపాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనబడుతోంది.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్‌లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams
యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన:
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ఇప్పుడు అవిఎలా వెనక్కు వెళ్తున్నాయో చెబుతాను. రాష్ట్రంలో ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితులు. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం. దాని ద్వారా కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు.. ఇవేవీ కనిపించడం లేదు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ లేదు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. ప్రతి చోటా దోపిడి. ఒక మాఫియా సామ్రాజ్యం. పైస్థాయి నుంచి కింది వరకు ఎక్కడిక్కడ కమిషన్లు. దోపిడి.
కష్టాలు స్వయంగా చూసి..:
గతంలో అసాధ్యం అనుకున్న మార్పులు మనం చేసి చూపగలిగాం. మేం తీసుకొచ్చిన ప్రతి మార్పు, నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక, తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగింది. ప్రతి రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చాం. ఊహించని మార్పులు తేగలిగాం. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోనూ డోర్ డెలివరీ చేశాం. ఆ విధంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ. వాలంటీర్ల వ్యవస్థ. దాదాపు 540 రకాల సేవలు అందించాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ఎక్కడా, లంచాలు, వివక్ష లేదు. క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశాం. ప్రతి ఇంటికి మేలు చేశాం. ఈరోజు మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. పథకాల కోత మొదలైంది. ఏ పని కావాలన్నా టీడీపీ నాయకుల ఇళ్లు తిరగాల్సిందే.
విద్యా రంగం:
బడులు పూర్తిగా మార్చాం. ప్రైవేటుకు థీటుగా వాటిని అభివృద్ధి చేశాం. ఇంగ్లిష్ మీడియమ్‌తో మొదలు పెడితే, సీబీఎస్‌ఈ, ఐబీ వరకు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. డిజిటల్ క్లాస్‌రూమ్స్. ట్యాబ్‌లు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, పూర్తి ఫీజు చెల్లింపు, అమ్మ ఒడి, మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ మొదలుపెడితే కరికులమ్‌లో మార్పులు. ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయి.
వైద్య రంగం:
గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఇంటి వద్దనే వైద్యం. విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. 52 వేల పోస్టులు భర్తీ చేసి జీరో వేకెన్సీ తెచ్చాం. రాష్ట్రంలో స్పెషలిస్టుల కొరత కేవలం 4 శాతం. అది జాతీయ స్థాయలో 61 శాతం. 3300 చికిత్సలు ఆరోగ్యశ్రీలో. ఆరోగ్య ఆసరా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు మొదలైంది మా ప్రభుత్వ హయాంలోనే.
వ్యవసాయ రంగం:
చేయి పట్టుకుని రైతులను నడిపించాం. ఈ–క్రాప్ వ్యవస్థ, ఆర్బీకేలు, దళారుల ప్రమేయం లేకండా పంటల కొనుగోలు. అదే ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనమే. ప్రతి రోజూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెస్పీ కంటే దాదాపు రూ.400 కంటే తక్కువకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. దళారుల చేతిలోనే అన్నీ.
ఫీజు రీయింబర్స్‌మెంట్:
ప్రతి క్వార్టర్ అయిపోగానే, ఫీజులు చెల్లించేవాళ్లం. ఇప్పటికీ మూడు క్వార్టర్లు పూర్తి కాగా, జనవరికి నాలుగు క్వార్టర్లు. ఆ మేరకు పిల్లల ఫీజులు బకాయిలు. కాలేజీల్లో పిల్లలను వెనక్కు పంపుతున్నారు. బడులకు పోయే పిల్లలు పంట పొలాల్లో పని చేస్తున్నారు. రూ.2800 కోట్లు విద్యాదీవెన బకాయిలు. రూ.1100 వసతిదీవెన బకాయిలు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2200 కోట్లు దాటాయి. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 108, 104 సర్వీసులు మూలనబడ్డాయి. వాలంటీర్లను తొలగించారు. వారికి రూ.10 వేలు ఇస్తామని పచ్చిగా మోసం చేశారు. అన్ని వ్యవస్థలు దారుణంగా వెనక్కు పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment