ఆర్‌టీఐ ప్రజాస్వామ్యానికి బ్రహ్మాస్త్రం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఐ ప్రజాస్వామ్యానికి బ్రహ్మాస్త్రం

Mar 16 2026 7:50 AM | Updated on Mar 16 2026 7:50 AM

ఆర్‌టీఐ ప్రజాస్వామ్యానికి బ్రహ్మాస్త్రం

రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి.సింహాచలం నాయుడు

చేబ్రోలు: సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే శక్తివంతమైన సాధనమని, ప్రజాస్వామ్యానికి ఇది బ్రహ్మాస్త్రం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి.సింహాచలం నాయుడు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ‘20 సంవత్సరాల ఆర్‌టీఐ, గుడ్‌ గవర్నెన్స్‌’ అనే అంశంపై వర్క్‌షాప్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2005లో అమల్లోకి వచ్చిన ఆర్‌టీఐ కేవలం ఒక చట్టం కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చిన కీలక సంస్కరణ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందే హక్కును ఈ చట్టం కల్పించిందని చెప్పారు. సమాచార హక్కు భావనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రను వివరించారు. భారతదేశంలో ఆర్‌టీఐ చట్టం ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితంగా అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజస్థాన్‌లోని బేవర్‌ ప్రాంతంలో మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ (ఎంకేఎస్‌ఎస్‌) వంటి ప్రజా ఉద్యమాలు ‘హమారా పైసా – హమారా హిసాబ్‌’ అనే నినాదంతో సమాచార హక్కు కోసం పోరాడినట్లు వివరించారు. ఆ ఉద్యమాల ప్రభావంతోనే ఆర్‌టీఐ రూపుదిద్దుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టీఐ అమలుతో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు ఆర్‌టీఐని సమర్థంగా వినియోగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ పి.మనోజ్‌ కుమార్‌ విద్యార్థులకు ఆర్‌టీఐ పిటీషన్‌ ఎలా దాఖలు చేయాలో వివరించారు. కార్యక్రమంలో లా డైరెక్టర్‌, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement