సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు.
‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
.. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు.


