ప్రజాస్వామ్యంపై దాడికి దిగారు.. టీడీపీ మూకల అరాచకంపై వైఎస్ జగన్ ఫైర్ | YS Jagan Expresses Outrage Over TDP Attacks on YSRCP Candidates; Demands Central Forces | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంపై దాడికి దిగారు.. టీడీపీ మూకల అరాచకంపై వైఎస్ జగన్ ఫైర్

Oct 16 2026 10:31 PM | Updated on Oct 16 2026 11:10 PM

YS Jagan Expresses Outrage Over TDP Attacks on YSRCP Candidates; Demands Central Forces

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే టీడీపీ శ్రేణులు అరాచకానికి దిగాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడికి తెగబడిందని మండిపడ్డారు. ఈ దాడులు, అరాచకాలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతను, పోలీసుల నిమ్మకు నీరెత్తిన వైఖరిని ఎండగట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకల అరాచకాలు
వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో పాశవిక దాడిని జగన్ ఖండించారు. ఈ దాడిలో ఎంపీ వాహనాలు ధ్వంసమవ్వడమే కాకుండా ఆయన గన్ మన్లకు కూడా గాయాలయ్యాయని తెలిపారు.

నామినేషన్ కేంద్రం ఆవరణలోనే దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, లోక్‌సభలో తమ పార్టీ పక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. మూడు గంటలకు పైగా వేచి ఉన్నా అధికారులు  వైఎస్సార్‌సీపీ  అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించలేదని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే ఆఫీసుకు నిప్పు

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ   అభ్యర్థులను నామినేషన్ వేయకుండా బెదిరించారని, బెదిరింపులను లెక్కచేయక ముందుకు వెళ్లినవారిపై దాడులు చేశారని జగన్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి నిప్పుపెట్టి, వాహనాలను తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడినవారిని వదిలేసి, బాధితులైన వైయస్సార్‌సీపీ కార్యకర్తలనే పార్టీ కార్యాలయం ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు ఆదేశించడం దారుణమన్నారు.

నామినేషన్ పత్రాల చించివేత

తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారని, పార్టీ నేతలపై భౌతిక దాడులు చేశారని ఆయన తెలిపారు. ధర్మవరంలో పోలీసుల సమక్షంలోనే  వైఎస్సార్‌సీపీ  అభ్యర్థులపై దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కున్నారని పేర్కొన్నారు.

కడప 30వ డివిజన్ వైయస్సార్‌సీపీ అభ్యర్థిని అడ్డుకుని, రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారన్నారు. ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు, చర్యలు తీసుకోలేదని సీరియస్ అయ్యారు. దాచేపల్లి నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకుని, ఆయన వద్ద మద్యం బాటిళ్లు పెట్టి తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తూ బలవంతంగా నిర్బంధించారని జగన్ అన్నారు.

పారామిలటరీ బలగాల మోహరింపునకు డిమాండ్
ప్రభుత్వ యంత్రాంగం చంద్రబాబు సొంత ఆస్తి కాదు. హింస ద్వారా టీడీపీ కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేదు అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ దాడులు తమ కార్యకర్తల సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని,  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతీ దాడిపై సమగ్ర విచారణ జరిపి దాడులు చేసిన వారిని, సహకరించిన అధికారులను బాధ్యులను చేయాలి. దాడుల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులందరికీ మళ్లీ అవకాశం కల్పించి వారికి రక్షణ ఇవ్వాలి. భయాందోళనలు లేని వాతావరణం కోసం ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టాలి.

పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లలో నిరంతర సీసీటీవీ లైవ్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. బ్యాలెట్ పేపర్ అకౌంట్‌పై సంతకాల ధ్రువీకరణ సరిగ్గా జరిగేలా పర్యవేక్షించాలి.

రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం నామినేషన్ల సందర్భంగా పచ్చ మూకలు చేసిన దాడుల్లో మిథున్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement