పాట్నా: బిహార్ రాజకీయాల్లో మోకామా ఎమ్మెల్యే అనంత సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో తాను ‘తొమ్మిది మంది హత్యకు కారణమయ్యానని’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో జేడీ(యూ) నేత అనంత సింగ్, పార్టీ అధినేతతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ కుమార్ కోసం తాను చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ మోకామా ఎమ్మెల్యే ఇలా అన్నారు. ‘నేను చేసినన్ని త్యాగాలు ఇంకెవరు చేశారు? అప్పట్లో నితీశ్ కుమార్ ఎవరో కాదు. ఆయన ఇక్కడిక్కడే తిరిగే వారు. ఆ సమయంలో నితీశ్ కుమార్‌తో ఉన్నందువల్ల నేను ‘తొమ్మిది మందిని హత్య చేయించాను’అని సింగ్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో మీడియా తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందన్నారు. తాను హత్యలు చేయించినట్లు చెప్పలేదని, తన అనుచరులైన తొమ్మిది మంది హత్యకు గురయ్యారని చెప్పబోయి అలా అన్నానని స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను వీడి నితీశ్ కుమార్‌తో జతకట్టిన తర్వాత తానే ఆ తొమ్మిది మంది మరణాలను వ్యక్తిగత నష్టంగా భరించాల్సి వచ్చిందని సింగ్ తెలిపారు. ఆ సమయంలో తనపై కూడా కాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా, గుండెపోటుతో తన తండ్రి మరణించారని కూడా గుర్తుచేశారు.
నితీశ్ కుమార్‌తో జరిగిన ఓ సమావేశం తర్వాత కొద్ది రోజులకే ఈ హత్యలు జరిగాయని సింగ్ చెప్పారు. ఆ సమావేశానికి వెళ్లవద్దని లాలూ ప్రసాద్ యాదవ్ తనకు వారించినప్పటికీ, తాను లెక్కచేయకుండా వెళ్లి నితీశ్ కుమార్‌ను వెండి నాణేలతో తూకం వేయించానని (తులభారం) తెలిపారు. నితీశ్ కుమార్‌కు మద్దతుగా నిలిచినప్పుడు తాను చేసిన త్యాగాలను వివరించేందుకే ఆ ఉదంతాలను ప్రస్తావించానని అనంత సింగ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను సందర్భం నుండి వేరు చేసి చూపించారని, తాను ఎవరి హత్యలనూ చేయించలేదని ఆయన ఖండించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి వివాదం మధ్యలో
పాట్నా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనతా దళ్ (యునైటెడ్) తన అభ్యర్థిగా నీరజ్ కుమార్‌ను ఖరారు చేయడంపై పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన తరుణంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. నీరజ్ కుమార్ గతంలో తనను వ్యతిరేకించారని, పార్టీకి ఆయన చేసిన సేవలు ఏమిటని ప్రశ్నిస్తూ అనంత సింగ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
అభ్యర్థి ఎంపిక విషయంలోనే తన అసంతృప్తినని, అంతేకాని నితీశ్ కుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అదే ఇంటర్వ్యూలో అనంత సింగ్ మాట్లాడుతూ.. ‘నేను నితీశ్ భక్తుడిని. నేను ఎవరినీ సవాలు చేయడం లేదు’అని అన్నారు. అప్పట్లో నితీశ్‌తో పొత్తులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‌తో మాట్లాడి, తన సోదరుడికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వచ్చేలా నితీశ్ కుమార్ ఎలా సహాయపడ్డారో కూడా సింగ్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలు విడిపోయినప్పటికీ, లాలూ శిబిరాన్ని వీడి నితీశ్ వైపే నిలబడ్డానని సింగ్ చెప్పారు.
కాగా, స్థానికంగా ఛోటే సర్కార్‌గా పిలువబడే అనంత సింగ్, నీరజ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సీనియర్ జేడీ(యూ) నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు.
Patna, Bihar: When asked if he still supports his party, JD(U) MLA Anant Singh says, "...Who has made as many sacrifices as I have? Nitish Kumar was nothing back then; he used to roam around here and there. At that time, while being with Nitish Kumar, I got nine people murdered..."
— IANS (@ians_india) October 16, 2026


