సాక్షి, తాడేపల్లి: కళ్ల ముందు వాళ్లు చేస్తున్న అవినీతి కనిపిస్తున్నా.. కూటమి నేతలు తాము నిజాయితీపరులమనే భ్రమను ప్రజలకు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కొందరు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
ఏపీలో ఇప్పుడు గ్రామాల్లో వాడవాడలా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పర్మిట్ రూమ్‌లు వెలిశాయి. వాటిల్లో ఎమ్మార్పీ రేట్ల కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఇసుక అమ్మకాలతో గత ప్రభుత్వంలో ప్రతీ ఏడాది రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక రేట్లు డబుల్ అయ్యాయి. కానీ, ఖజానాకు మాత్రం పైసా రావడం లేదు. సిలికా,క్వార్ట్జ్(మైనింగ్).. ఇలా ఏది కూడా అనుమతుల్లేకుండా మాఫియాలు నడుస్తున్నాయి.
అమరావతిలో నిర్మాణాల పేరుతో జరిగేది ఏంటి? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇదంతా కళ్ల ముందు కనిపించేదే కదా!. భూములు ఇవ్వడం ఒక స్కామ్ అయితే.. నిర్మాణ ఖర్చులు ఇవ్వడం ఇంకా పెద్ద స్కామ్’’ అని జర్నలిస్టులను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.
సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్ జరిగింది. ఇందులో చంద్రబాబు, నేతలు, పోలీసులు కూడా వాటాలేసుకున్నారు. జూదం అనేది చట్టబద్దమా?. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రొత్సహించడమేంటి?. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా?.. ఇది అవినీతి కిందకే వస్తుంది కదా.. లూటీ కదా!.. అని అన్నారాయన.
ప్రతిపక్ష హోదా అంశంపై వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ ప్రశ్నకు గతంలో చాలాసార్లు సమాధానం ఇచ్చామని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో తాము తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదనే విషయాన్ని మీడియా గుర్తించాలని.. సభలో మైక్ ఇచ్చే పరిస్థితులు లేనందునే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోందని వైఎస్ జగన్ అన్నారు.


