Basavaraj Bommai: కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?

Will Karnataka Chief Minister Change Again Buzz Over Amit Shah Visit - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో హిజాబ్‌, హలాల్‌, లౌడ్‌ స్పీకర్లు, కాంట్రాక్టర్‌ ఆ‍త్మహత్య వంటి వివాదాలు తెరపైకి రావడంతో సీఎం బొమ్మై సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టమని భావించిన బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు(సోమవారం) బెంగుళూరులో పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులతో చర్చించి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. దీనికితోడు బీజేపీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానికి ఉందంటూ గుజరాత్‌లో చేసినట్లే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

కాగా కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా.. కొంతకాలానికే ఆయను తొలగించి బసవరాజ్‌ బొమ్మైని సీఎంగా అధిష్టానం నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు అవుతోంది. త్వరలోనే బొమ్మై తన కేబినెట్‌ను త్వరలో విస్తరించాలని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా బెంగళూరు వస్తుండటంతో, పార్టీ నాయకత్వ మార్పు గురించి చర్చిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
చదవండి: మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. షెడ్యూల్‌ ఇదే

స్పందించిన యడియూరప్ప
కర్ణాటకలో సీఎం మార్పు అంటూ వస్తున్న పుకార్తపై మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప స్పందించారు. తనకు తెలిసినంత వరకు రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరిగే అవకాశం లేదని అన్నారు. సీఎం బొమ్మై అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ యడియూరప్ప కితాబు ఇచ్చారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో 150 అసెంబ్లీ సీట్లు సాధించే దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వ్యూహాలపై సలహాలు ఇస్తారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top