
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఈ మే నెలలో జరిగిన యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కార్నర్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. ట్రంప్ చెప్పినదాంట్లో నిజం ఏమిటి? అని ప్రశ్నించారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు.
मोदी जी, 5 जहाज़ों का सच क्या है?
देश को जानने का हक है! pic.twitter.com/mQeaGCz4wp— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025
కాగా, ఇరు దేశాల యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ చెప్పినప్పటికీ, అవి ఏ దేశానికి చెందినవో చెప్పలేదు. ఇరు దేశాల యుద్ధ విమానాలు కలిపి ఐదా.. లేక పాకిస్తాన్‌వా.. భారత్‌కు చెందినవా? అనేదే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్.. ఆపరేషన్ సింధూర్ వ్యవహారాన్ని ఉభయ సభల్లో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లే కనబడుతోంది.
ట్రంప్ తాజా వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జై రాం రమేశ్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ట్రంప్ మిసైల్ దూసుకుపోతోంది. ఇప్పటికి 24 సార్లు ఒకే సందేశాన్ని ట్రంప్.. పదే పదే చెబుతూ వస్తున్నారు.
"2019, సెప్టెంబర్‌లో 'హౌడీ మోడీ', 2020, ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో సంవత్సరాల తరబడి స్నేహం కలిగి ఉన్న ప్రధాని మోదీ.. గత 70 రోజులుగా ట్రంప్ ఏమి చెబుతున్నారనే దానిపై పార్లమెంట్‌లో స్పష్టత ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి ట్రంప్ మాట్లాడుతున్న ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని జై రాం రమేశ్ ముందుగానే తాము ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తనున్నామని విషయాన్ని స్పష్టం చేశారు.