వాగ్దానాలు సరే.. మా బతుకులు మారేదెప్పుడు..?

West Bengal Assembly Election 2021: Tea Garden Workers Demands - Sakshi

ప్రభుత్వాలు మారినా... మారని తలరాతలు 

పూట గడవడమే కష్టంగా కాలాన్ని వెళ్ళదీస్తున్న తేయాకు కూలీలు

పోషకాహార లోపంతో అనేక సమస్యలు

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన కూలీల కష్టాలు 

సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్‌ అస్మిత.. బెంగాల్‌ సంస్కృతి... ఈ మాటలు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఎంసీ, బీజేపీ నాయకుల మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ దూసుకువెళ్తున్నప్పటికీ, రాష్ట్రంలోని అనేకమంది సామాన్యులు ఇప్పటికీ పూట గడవటమే కష్టంగా కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. అలాంటి సామాన్యుల్లో బెంగాల్‌కు వన్నె తెచ్చిన తేయాకు తోటల్లో కష్టపడి పనిచేస్తున్న కూలీల వ్యధను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాలు, చేసే వాగ్దానాలు తమ పొట్ట నింపే పరిస్థితి ఏమాత్రం లేదనేది తేయాకు తోటల్లో పనిచేస్తున్న కూలీల మాట. ఇన్నేళ్ళుగా అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, నేటికీ బెంగాల్‌లో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. పొట్ట నిండేందుకు సరిపడా ఆహారంలేక, తల దాచుకొనేందుకు బలమైన పైకప్పు ఉన్న ఇళ్ళు లేక కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వీటన్నింటికి తోడు తేయాకు తోటల్లో ఆకులు తీసేటప్పుడు తరుచుగా అడవి జంతులవుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే వారు ఉన్నారు.  

3.5 లక్షల మంది కూలీలు 
ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం డార్జిలింగ్, జల్పాయిగురి, అలీపురద్వార్‌ల్లో కలిపి మొత్తం 302 తేయాకు గార్డెన్లు, మరికొన్ని చిన్న తేయాకు తోటలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని 15 తేయాకు తోటలు మూతబడ్డాయి. వీటన్నింటిలో కలిపి సుమారుగా మూడున్నర లక్షల మంది కూలీలు ప్రతీరోజు పనిచేస్తుంటారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల రోజువారీ వేతనాలు సైతం ఇతర పనులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం కార్మికులకు రోజుకు రూ.202 మాత్రమే కూలీ లభిస్తుంది. ఇది కనీస వేతనం కంటే చాలా తక్కువ. ఒకవేళ తేయాకు తోటలు మూసివేస్తే, కార్మికుల జీవనోపాధికి మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంది. తక్కువ వేతనాల కారణంగా చాలీ చాలని ఆహారంతో చాలా మంది కార్మికులు పోషకాహార లోపానికి గురవుతున్నారు.

తేయాకు తోటల్లో కార్మికులు వారానికి ఆరు రోజులు తోటల పెంపకం చేయాల్సి ఉంటుంది. ప్రతి కార్మికుడు రోజుకు 25 కిలోల తేయాకు తీయాల్సి ఉంటుంది. ఈ 25 కిలోల తేయాకు తీసేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది. ఒకవేళ కూలీలు తెంపిన తేయాకు రోజువారీ బరువు కంటే తక్కువగా ఉంటే కిలోకు మూడు రూపాయల చొప్పున వారికి ఇచ్చే వేతనంలో కోత ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 25 కిలోల కంటే అధికంగా తెంపితే మాత్రం వారికి కిలోకు రూపాయిన్నర మాత్రమే వారి వేతనంతో కలిసి చెల్లిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చోట్ల తేయాకు తోటలు మూసివేస్తుండడంతో కూలీలకు సకాలంలో వేతనాలు అందట్లేదనే ఫిర్యాదులు కార్మిక శాఖకు వస్తుంటాయి. ప్రభుత్వాలు ఇలాంటి కార్మికుల విషయంలో దృష్టి సారించక పోవడంతో పోషకాహార లోపం, ఇతర వ్యాధులతో బాధపడుతున్న కార్మికులకు అవసరమైన కనీస ఆరోగ్య సదుపాయాలు కూడా లేవని అనధికారిక వర్గాల సమాచారం.  

హామీలే... అమలేది? 
ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రం హామీలు ఇచ్చి, ఆ తర్వాత పట్టించుకున్న వారే కరువయ్యారని కూలీలు వాపోతున్నారు. ప్రస్తుత తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తేయాకు తోటల్లో పనిచేసే కూలీల అభివృద్ధికి జై జోహార్, చాయ్‌ సుందర్‌ సహా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇటీవల క్లోజ్డ్‌ గార్డెన్స్‌ కూడా తెరుస్తున్నారు. మరోవైపు కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1000 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని బీజేపీ నాయకులు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, తేయాకు తోటల యజమానుల వైఖరి కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల హక్కులను యజమానులు కాలరాస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ప్రచారాంశంగా మారే తేయాకు తోటల కూలీల అభివృద్ధి అంశం కాస్తా, ఎన్నికలు పూర్తయిన తరువాత మరుగున పడిపోతుందనేది వాస్తవమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

చదవండి:
టీఎంసీలో చేరిన టీమిండియా ఆటగాడు

కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top