రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం

We will form a farmer commission says Revanth Reddy - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో రైతులతో ముఖాముఖి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/మోర్తాడ్‌(బాల్కొండ)/భీమ్‌గల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల సమస్యల పరిష్కారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్‌ మాదిరిగా ‘రైతు కమిషన్‌’ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి ఆదివా రం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి వద్ద రైతులతో ముఖా ముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. రైతులను ఆదుకునేందుకు చేసిన వరంగల్‌ డిక్లరేషన్‌ను అమలు చేసే బాధ్యతను తీసుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు.

ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా భూమి లేని రైతులకు రూ. 12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నట్లుగా వరికి క్వింటాలుకు రూ. 2,660 మద్దతు ధర ఇస్తామన్నారు. కాగా కేసీఆర్‌ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటూ క్రాప్‌ హాలిడే ప్రకటిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఆరు నెలల్లో తెరిపిస్తామన్నారు. అలాగే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, ఆరోగ్యశ్రీ కింద రూ. 5 లక్షలు చెల్లిస్తామన్నారు.

రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామన్నారు. 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు తామెలా మోసపోయామో ఆలోచించాలన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు, ఎరువులు, విత్తనాలకు సబ్సిడీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం మానేసి కేవలం రైతుబంధు పేరిట ఎకరానికి రూ.10వేలు ఇచ్చి రైతులకు ద్రోహం చేస్తోందన్నారు.  

పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లే..: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూస్తే ప్రజలు పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం బాండ్‌ పేపర్‌ రాసిచ్చి ఎంపీగా గెలిచిన అర్వింద్‌ మాటతప్పారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. 

రాజన్న జ్ఞాపకాలు పదిలం.. 
రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలను గుర్తెరిగిన నేతగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తీసుకున్న నిర్ణయాలతో ఆయన పాలన సమయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని రైతులు, కాంగ్రెస్‌ నేతలు కొనియాడారు. కమ్మర్‌పల్లిలో జరిగిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో వారు రాజన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.

డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి రైతుల సమస్యలు తెలుసు కాబట్టి ప్రకృతి వల్ల పంటలు దెబ్బతింటే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు.  

సీఎం కూతురునే ఓడించారు
హామీలను నేరవేర్చని సీఎం కూతురు కవితనే ఓడించిన ఘనత నిజామాబాద్‌ జిల్లా రైతులకు ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం భీమ్‌గల్‌లోని లింబాద్రి గుట్టపై లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గుట్ట కింద విలేకరులతో మాట్లాడారు.

‘సీఎం కేసీఆర్‌ నేను ఏది చెబితే అది చేస్తారని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పదేపదే అంటారని.. అలాంటప్పుడు ఇక్కడి చెరుకు పరిశ్రమను తెరిపించాల్సిన బాధ్యత ఆయనకు లేదా?’అని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పే మంత్రి.. భీమ్‌గల్‌ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు ఎందుకు తేలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top