చెప్పేదంతా నమ్మేందుకు ఇది టెన్‌ జన్‌పథ్‌ కాదు.. తెలంగాణ జనపథం

Warangal: Minister KTR Fires On Rahul Gandhi Congress Party On Telangana Tour - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

రిమోట్‌ కంట్రోల్‌ పాలన మీది కాదా? 

అమేథీలోనే గెలవలేదు.. 

తెలంగాణలో పీకి పందిరేస్తావా? 

ఓటుకు నోటు దొంగను పక్కనబెట్టుకొని అవినీతి గురించి మాటలా? 

కేసీఆర్‌ నియంత అయితే పొద్దున లేస్తే తిట్టేటోళ్లు ఇక్కడ ఉండేవాళ్లా? 

ఏం తెల్వనోనివి.. అంతకే ఉంటే మంచిదని హెచ్చరిక 

వరంగల్, హనుమకొండల్లో మంత్రి సుడిగాలి పర్యటన 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీతో సంబంధముందని, రాష్ట్రంలో రిమోట్‌ ద్వారా పాలన నడుస్తోందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ అంటేనే రిమోట్‌ కంట్రోల్‌ పాలనని, 2004 నుంచి 2014 వరకు రాజ్యాంగేతర శక్తిగా ఇష్టారాజ్యంగా చెలరేగింది సోనియాగాంధీ కాదా? అని నిలదీశారు. ‘పేరుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని. నిర్ణయాలు మాత్రం సోనియావే. రిమోట్‌ కంట్రోల్‌  పాలన ఎవరిది?’అని ప్రశ్నించారు. ‘నేరపూరిత రాజకీయాలను అరికట్టాలని మన్మోహన్‌ ఓ ఆర్డినెన్స్‌ తెస్తే దాన్ని చింపేసింది రాహుల్‌ కాదా?’అని ప్రశ్నించారు. రాహుల్‌ చెప్పిందల్లా నమ్మడానికి తెలంగాణ టెన్‌ జన్‌పథ్‌ కాదని.. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ జనపథమని చురకలంటించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం కేటీఆర్‌ సుడిగాలి పర్యటన చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టును సందర్శించారు. తర్వాత హనుమకొండలోని రాంనగర్‌లో మంత్రి దయాకర్‌రావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు.  

ఏఐసీసీ.. ఆల్‌ ఇండియా క్రైసిస్‌ కమిటీ 
ఆల్‌ ఇండియా క్రైసిస్‌ కమిటీగా ఏఐసీసీకి కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్‌.. తమకు ఇతర పార్టీలకు బీ టీమ్, సీ టీమ్‌ అయ్యే దౌర్భాగ్యం పట్టలేదని.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే నంబర్‌ వన్‌ టీమ్‌ టీఆర్‌ఎస్‌ అని చెప్పారు. రాహుల్‌ ఏ పదవిలో వరంగల్‌కు వచ్చారో తమకు తెలియదని ఎద్దేవా చేశారు. ‘మమ్మీ గారు అధ్యక్షురాలు. మరి ఈ డమ్మీ గారు ఎంపీనా, అధ్యక్షుడా ఏంటో మాకు తెల్వదు. ఎప్పుడు ఇండియాలో ఉంటడో.. ఎప్పుడు బయట ఉంటడో తెల్వదు. కాంగ్రెస్‌ పార్టీ అల్లం బెల్లం చేస్తదని ఏ హోదాలో డైలాగ్‌లు కొట్టారో కూడా తెలియదు’అని సెటైర్లు వేశారు. ‘బీజేపీకి వత్తాసుగా మాట్లాడితే ఊరుకోను అని నిన్నటి వరంగల్‌ సభలో రాహుల్‌ మాట్లాడిండు. కేసీఆర్‌ను క్షమించను అనడానికి నువ్వు ఎవడివి’అని మండిపడ్డారు. ‘టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోం అంటుండు. దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే వారు లేరు. అమేథీలోనే గెలవలేవు. నువ్వు తెలంగాణకు వచ్చి పీకి పందిరేస్తావా?’అని దుయ్యబట్టారు. 

కాంగ్రెస్‌ కాదు స్కాంగ్రెస్‌  
కాంగ్రెస్‌ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యపు పార్టీ అని, కాంగ్రెస్‌ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్‌ నుంచి మొదలు పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్నీ కుంభకోణాలేనని విమర్శించారు. అమేథీలో తంతే కేరళలో పడ్డ రాహుల్‌.. ఇక్కడికొచ్చి ప్రచారం చేస్తే నమ్మేందుకు ప్రజలు రెడీగా లేరన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ పాత చింతకాయపచ్చడని, దమ్ముంటే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో అమలు చేయాలని సవాల్‌ చేశారు. 

గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారు 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని గాడ్సేగా అభివర్ణించిన కేటీఆర్‌.. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన అజ్ఞాని రాహుల్‌ అని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు దొంగను పక్కను కూర్చొబెట్టుకొని అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు పోతుందన్నారు. ‘నీ ముత్తాత మోతీలాల్‌ నెహ్రూ నుంచి మొదలుపెడితే జవహర్‌లాల్, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ, తర్వాత నువ్వు.. రాజరికం మాదిరి ఉన్నారు. ఇక్కడికొచ్చి రాజులు అని మాట్లాడుతున్నారు’అని విమర్శించారు. ‘నువ్వు ఏం తెల్వనోనివి. రాసిస్తే చదివి పోయే వ్యక్తివి. అమాయకుడివి, అజ్ఞానివి. అంతకే ఉంటే మంచిది’అని హెచ్చరించారు. ‘కేసీఆర్‌ నియంత అయితే.. పొద్దునే లేస్తే తిట్టుడు ప్రోగ్రామ్‌ పెట్టుకునే వారు ఇక్కడే ఉండేవారా?’అని ప్రశ్నించారు. 

చదవండి: Rahul Gandhi Tour: మీడియాకు ఎక్కితే ఉపేక్షించం.. సొంత పార్టీ నేతలకు రాహుల్‌ వార్నింగ్‌

తెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం 
తెలంగాణ తామే ఇచ్చామని చెబుతున్నారని.. కానీ ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది రాహుల్‌ తాత నెహ్రూ కాదా అని కేటీఆర్‌ నిలదీశారు. కేసీఆర్‌ నేతత్వంలో కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెడితేనే రాష్ట్రం వచ్చిందన్నారు. 60 ఏళ్లు పోరాడి ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారని.. రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది తామేనని చెప్పారు.  

జోడెద్దుల మాదిరి తెలంగాణలో అభివృద్ధి 
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా కేసీఆర్‌ జోడించి అన్ని రంగాల్లో సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌లోని టెక్స్‌టైల్‌ పార్క్‌లో రెండేళ్లల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని... దీంతో 20 వేల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. వరంగల్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు జరుగుతోందని.. వచ్చే ఐదేళ్లలో జిల్లాలోనే 50 వేల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. మామునూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే శనివారం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించానని చెప్పారు.  

మిగతా రాష్ట్రాల్లో రైతుల పరిస్థితిని మన రైతన్నలకు వివరిద్దాం 
సాక్షి, వరంగల్‌: బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని రైతుల దుస్థితి గురించి రాష్ట్రంలోని రైతు వేదికల్లో చర్చ పెడదామని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో రైతు దుస్థితి ఎలా ఉందో మన రైతన్నకు వీడియోల రూపంలో వివరిద్దామని అన్నారు. వరంగల్‌ జిల్లా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత పరకాల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు కరోనా వల్ల ఆలస్యమైందని, లేదంటే ఇప్పటికే కళకళలాడాల్సిందని అన్నారు. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సంస్థ కైటెక్స్‌ దేశంలో రూ.3 వేల కోట్ల పెట్టబడులు పెట్టాలని చూస్తుండగా వారిని ఒప్పించి ప్రత్యేక విమానంలో వరంగల్‌కు తీసుకొచ్చామని చెప్పారు. ఈ రోజూ భూమిపూజ చేసిన ఈ కంపెనీ రూ.1600 కోట్ల పెట్టుబడులతో 15,000 మందికి ఉపాధి ఇవ్వనుందన్నారు. నార్త్‌ ఫేస్, క్వాలివెన్‌ తదితర బ్రాండ్‌లు తయారుచేసే కొరియాకు చెందిన యంగ్‌వన్‌ కంపెనీ రూ.1,100 కోట్ల పెట్టుబడితో దాదాపు 12,000 మందికి ఉపాధి కల్పించనుందన్నారు. తాజాగా ప్రారంభించి గణేశ్‌ ఎకోపెట్‌ ఇండస్ట్రీస్‌ ద్వారా ప్రతిరోజూ 400 టన్నుల ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కరగబెట్టి అందులోంచి గింజలు, పోగులు తీసి వస్త్రాలు తయారు చేస్తారన్నారు. 

చదవండి: పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు: కేటీఆర్ సెటైర్లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top