
సమావేశంలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి, మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని, అక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సమంజసమేనని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన విశాఖ కలెక్టరేట్‌లో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని పెడతామంటే చంద్రబాబుకు నిద్రపట్టట్లేదని విమర్శించారు.
విశాఖ విమానాశ్రయం నౌకాదళానికి చెందినదని, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయినవెంటనే విశాఖ విమానాశ్రయాన్ని నౌకాదళానికి అప్పగించడం సంప్రదాయమన్నారు. భోగాపురం విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ త్వరలోనే పునాదిరాయి వేయనున్నారని చెప్పారు.ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజ్యాంగ పదవిలో ఉంటూ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి నిమిషం పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లడానికే హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు విఫలయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బి.సత్యవతి, ఎమ్మెల్యేలు యూవీ రమణమూర్తిరాజు, గొల్ల బాబూరావు, అమర్‌నాథ్, నాగిరెడ్డి, గణేష్‌కుమార్, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పాల్గొన్నారు.