
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న కుళ్లుతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో మత విద్వేషాల చిచ్చు పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. తానే కుట్ర చేసి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రామతీర్థం ఘటన తొలిసారి టీడీపీ సోషల్ మీడియాలోనే ప్రచారం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే రామతీర్థంలో చంద్రబాబు ప్రెస్‌మీట్ తరువాత దీనివెనుక ఆయన పూర్తి హస్తముందనే అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. తన పాత్ర లేకపోతే రామతీర్థం వెళ్లిన చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ డిమాండ్ చేసినట్లుగా ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు.
అలాగైతే ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టలేవు..
‘‘ఎల్లకాలం అధికారం తనకే ఉండాలని విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించినందుకు చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అధికారం కోసమని దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ఈసారి అసలు ఆయన అసెంబ్లీలోకే అడుగు పెట్టే పరిస్థితి ఉండదు’’ అని వెలంపల్లి హెచ్చరించారు. బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే చంద్రబాబు హిందువా? అని ప్రశ్నించారు. అలాంటి ఆయన దేవుడిపై భక్తిని ఒలకబోస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.
రామతీర్థం వెళ్లి చంద్రబాబు రాజధాని అమరావతి గురించే మాట్లాడి తన నైజం నిరూపించుకున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగిస్తుండేసరికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ చేసుకోవడానికి జై శ్రీరామ్ అంటూ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఖబడ్దార్ అంటూ సీఎం జగన్‌కు వార్నింగ్ ఇవ్వడానికి చంద్రబాబెంత, ఆయన బతుకెంత.. అని మండిపడ్డారు. రామతీర్థం టెంపుల్‌కు ఇప్పటిదాకా చైర్మన్‌గా కొనసాగింది చంద్రబాబు పక్కన కూర్చున్న అశోకగజపతిరాజేనని, ఘటన జరిగాక ఆయనెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల్ని, భూముల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు.