దుబ్బాక ఉప ఎన్నికపై టీపీసీసీ ప్రకటన

Uttam Kumar Reddy Says Congress Party Will Contest In Dubbaka Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసే విషయమై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) శుక్రవారం ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్‌ పార్టీ తప్పక పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా దుబ్బాక శాసన సభ సభ్యుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి (57) ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.(దుబ్బాక ఎమ్మెల్యే ‘సోలిపేట’ కన్నుమూత)

పార్లమెంటులో అడుగుతా: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, తెలంగాణలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడతామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళితులకు 3 ఎకరాలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు. ఇటీవల తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి పార్లమెంట్‌లో అడుగుతానని పేర్కొన్నారు. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అండగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. (‘క్విట్‌ ఇండియా’ స్ఫూర్తితో ఉద్యమం)

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతుందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌పై కేసీఆర్‌ సర్కారు ఇచ్చిన లెక్కలు తప్పని నిరూపిస్తామని, కరోనా మరణాలపై మండలాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పీసీసీకి వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. కోవిడ్‌ మరణాల విషయంలో కేసీఆర్‌ సర్కారు గోప్యత పాటిస్తుందని ఆరోపించిన ఆయన.. మహమ్మారితో మృతి చెందిన పేద వర్గాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి సీఎం కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. హైకోర్టు చెప్పే వరకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ప్రభుత్వానికి కనిపించలేదా అని నిలదీశారు. ఇప్పటికైనా కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేస్తూ మృతి చెందిన హెల్త్, శానిటేషన్, పోలీసులు, జర్నలిస్టులకు రూ. 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు, వైఫల్యాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top