దుబ్బాక ఎమ్మెల్యే ‘సోలిపేట’ కన్నుమూత

dubbak mla solipeta ramalinga reddy Last Breath - Sakshi

కాలి ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటుతో తుదిశ్వాస

స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు

నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

కుటుంబానికి అండగా ఉంటామని హామీ

సాక్షి, సిద్దిపేట :  అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కాలిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 2.15 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్దసంఖ్యలో అభిమానులు చిట్టాపూర్‌ తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.

కాలిపై కురుపుతో ఆస్పత్రిలో చేరి.. 
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కొంతకాలంగా కుడికాలుపై కురుపుతో బాధపడుతున్నారు. అది కాస్తా పెద్దదవడంతో జూలై 22న చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు కాలికి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ అయి.. శరీరమంతా వ్యాపించింది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులతోపాటు, మెదడుకు కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో రామలింగారెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి తారకరామారావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. సోలిపేట ఆరోగ్య విషయమై డాక్టర్లతో సంప్రదించారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అప్పటికే మూత్రపిండాలు, కాలేయం పనిచేయకపోవడంతో పది రోజులు మృత్యువుతో పోరాడిన సోలిపేట బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. 

స్వగ్రామం చిట్టాపూర్‌లో  అంత్యక్రియలు 
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో గురువారం నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి మృతదేహాన్ని ఉదయాన్నే చిట్టాపూర్‌కు తరలించారు. సొంతింటి వద్ద పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై అంత్యక్రియల ఏర్పాట్లను చూశారు. స్వయంగా పాడె మోసి రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సోలిపేట భౌతికకాయాన్ని ఉంచి చిట్టాపూర్‌లోని కూడవెల్లి వాగు ఒడ్డున ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ కుమారుడు సతీష్‌ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.  

కంటతడి పెట్టిన కేసీఆర్‌
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి వార్త వినగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో సోలిపేట చికిత్స పొం దుతుండగానే పలుమార్లు ఆరోగ్య పరిస్థితి పై సీఎం ఆరాతీశారు. సోలిపేట మరణ వార్త తెలియగానే ప్రగతి భవన్‌ నుంచి హుటాహుటిన చిట్టాపూర్‌ చేరుకున్నారు. రామలింగారెడ్డి పార్థివదేహంపై పూలమాల ఉంచి నివా ళి అర్పించారు. కన్నీటి పర్యంతమవుతూ.. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డి వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటా నని ధైర్యం చెప్పారు. ఉద్యమకాలం నుంచి సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొద్దిసేపు అక్కడే విషణ్ణవదనంతో కూర్చుండిపోయా రు. రామలింగారెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొం దిన తీరును, ఆయన మరణానికి కారణాల ను మంత్రి హరీశ్‌రావును అడిగి తెలుసుకు న్నారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని హరీశ్‌రావుకు చెప్పి వెళ్లిపోయారు.  

ప్రముఖుల నివాళి..  
రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చిట్టాపూర్‌కు చేరుకున్నారు. సోలిపేట పార్థివదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతిరాథోడ్, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జోగు రామన్న, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హన్మంత్‌ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు హాజరై నివాళులర్పించారు.   

తీరని లోటు.. గవర్నర్, సీఎం సహా పలువురి నివాళి
దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా సోలిపేట అందించిన సేవలు మరువలేనివని గవర్నర్‌ అన్నారు. సోలి పేట మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఫారూక్‌ హుస్సేన్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్‌ దిగ్భ్రాంతి 

రామలింగారెడ్డి మృతి పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్ర మార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ తదితరులు సంతాపం తెలిపారు.

ఆయన సేవలు మరువలేనివి: బండి సంజయ్‌ 
సోలిపేట అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా సిద్దిపేటకు తీరని లోటని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ అన్నారు.  

ఏపీ సీఎం జగన్‌ సంతాపం 
సాక్షి, అమరావతి: సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి కుటుంబీకులకు జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top