
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి. ‘
ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్‌లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.
సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.
‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.
ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.