కాళేశ్వరం నిధులు దుర్వినియోగం! 

Union Minister Anurag Thakur Comments On KCR Family Over Kaleshwaram Funds - Sakshi

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

ఆ నిధులన్నీ కేసీఆర్‌ కుటుంబం జేబుల్లోకే.. 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేలకోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఆ నిధులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుటుంబం జేబుల్లోకి వెళ్లాయని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన దళితులు, అణగారిన వారి జీవితాలేమీ మారలేదని, కేసీఆర్‌ కుటుంబం మాత్రం బాగుపడిందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి అంటే ఒక్క కేసీఆర్‌ కుటుంబానిదేనా.? అని ప్రశ్నిం చారు. ప్రారంభంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు రూ.2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అందుకు ఈ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని అన్నా రు. రాష్ట్రంలో సాధారణ ప్రజలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతిభద్రతలు లేకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు వస్తే దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తాయని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన అనురాగ్‌ ఠాకూర్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.  

మోదీ విశ్వసనీయతను తెలుసుకోవాలి     
‘ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కేసీఆర్‌కు ప్రజల హృదయాల్లో స్థానం ఎలా సంపాదించుకోవాలో ఏం తెలుసు? ప్రధాని  మోదీకి దేశంలో, అంతర్జాతీయంగా ఉన్న విశ్వసనీయత, ఆదరణ గురించి కేసీఆర్‌ తెలుసుకోవాలి. మోదీ రెండుసార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు’ అని ఠాకూర్‌ అన్నారు.

కేసీఆర్‌ టూరిస్ట్‌లా తిరగాల్సిందే..
‘బీజేపీ నాయకులు రాజకీయ టూరిస్ట్‌లంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చిత్తుగా ఓడిపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ తర్వాత ఆయన దేశవ్యాప్తంగా టూరిస్ట్‌లా తిరగొచ్చు. ఈ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఆగ్రహం తో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, గూండాలు.. సామాన్యులను, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కుతున్నారు. అరాచకాలు చేసిన వారిని ఈ ప్రభుత్వం కాపాడుతోంది. ఇంతకంటే ఒక ముఖ్యమంత్రికి సిగ్గుచేటైన విషయం ఏముంటుంది?’అని ప్రశ్నించారు. మీడియా రేటింగ్‌లకు సంబంధించి ఫిర్యాదులు అందితే సీరియస్‌గా పరిగణిస్తామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top