ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం

TS Deputy CM Batti Vikramarka Family Enter Into Praja Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. 

ఇక, గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు.  అనంతరం, భట్టి విక్రమార్క సచివాలయానికి బయలుదేరారు. కాసేపట్లో సచివాలయంలోని తన చాంబర్‌లో భట్టి ఛార్జ్‌ తీసుకోనున్నారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త  ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్‌ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు.

కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్‌ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్‌.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top