ఎరువుల కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చారు

TRS Slams BJP Over Central Ministers Tour In Ramagundam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'రామగుండం ఎరువుల కర్మాగారంలో సమీక్షకు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు. కానీ ప్రొటోకాల్‌ పాటించలేదు. స్థానిక ఎంపీగా నాకు ఆహ్వానం అందలేదు. ఈ సందర్భంగా ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా అబద్ధాలు చెప్పడం విడ్డూరం. తెలంగాణకు రావాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 6.25 లక్షల టన్నులు రాష్ట్రానికి కేటాయించమని బీజేపీ నేతలు చెప్పడం తప్పు. ఇప్పటి వరకు 1.17 మిలియన్ టన్నుల యూరియా కూడా రాష్ట్రానికి అందించలేదు. 

రామగుండం ఫ్యాక్టరీలో 800 అదనపు ఉద్యోగాల్లో తెలంగాణ వారికి ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇచ్చారు. మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం. రామగుండంలో రాష్ట్ర వాటా 11 శాతం ఉంది. స్థానిక ఎంపీ అయిన నాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదో కేషన్ రెడ్డి చెప్పాలి. ప్రొటోకాల్ ప్రకారం నాకు దక్కాల్సిన ఆహ్వానం అందలేదు. రామగుండం ఫ్యాక్టరీతో కాలుష్యం ఎదుర్కొనే రెండు గ్రామాల ప్రజలు కేంద్ర మంత్రుల పర్యటనలో నిరసన తెలిపారు. ప్రజల తరపున మేము హాజరయ్యాం. బీజేపీ నేతలు అత్యుత్సాహంతో మా మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇర్లపల్లి, లక్ష్మిపూర్ ప్రజలకు పునరావాసం కల్పించాల్సిందే.

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చారు. కేంద్రం అంతరాష్ట్ర నదీ జలాల సమస్య పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేదో చెప్పాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో ఇదే అంశంపై నిలదీస్తాం. జాతీయ రహదారుల విషయంలో కేంద్రం అన్యాయం చేసింది. విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిస్తాం. దీనివల్ల వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బీజేపీ నేతలు మాతో కలిసి వస్తారా..? లేదా..? రాష్ట్ర పునర్విభజన హామీలను నేర వేర్చచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. బీజేపీ నేతలకు చిత్తశుద్ది ఉంటే మాతో కలిసి రావాలి. లేదంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని పేర్కొన్నారు. 

బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు
కేసీఆర్‌ చేస్తున్న కార్యక్రమాలు బీజేపీ నేతలకు నచ్చడం లేదు. తెలంగాణలో భవిష్యత్తు లేదని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు స్థానం లేదనే బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు' అని అన్నారు. - మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
కొత్త రెవిన్యూ చట్టంతో ప్రజలకు ఎంతో మేలు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాగే వ్యవహరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు దెబ్బతింటాయి. కేంద్రం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి. - టి. భానుప్రసాద్‌, ప్రభుత్వవిప్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top