తెలంగాణలో తృణమూల్‌ కాంగ్రెస్‌! 

Trinamool Congress In Telangana - Sakshi

దేశవ్యాప్త విస్తరణలో భాగంగా నిర్ణయం 

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలకు గాలం 

భావసారూప్యత ఉన్న నేతలకు ఆహ్వానం.. వస్తే స్వాగతిస్తామన్న టీఎంసీ ఎంపీ సుస్మిత దేవ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ తెలంగాణలో అడుగుపెట్టే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రంపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగా కొద్దిమంది కాంగ్రెస్‌ కీలక నేతలతోపాటు టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది.

పార్టీని విస్తృతం చేసే బాధ్యతలను మమతా బెనర్జీ ఇటీవల కీలక నేతలకు అప్పగించా రు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, వాటి బలహీనతలు తదితర అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బ్యాక్‌ఎండ్‌ వర్క్‌ చేస్తున్న ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఈనెల మొదటి వారంలో అధినేత్రికి నివేదికివ్వనున్నట్టు తెలిసింది. 

ఇప్పటికే అస్సాం, త్రిపుర, గోవా, యూపీలో.. 
గోవా, అస్సాం, త్రిపుర, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో తృణమూల్‌ కాం గ్రెస్‌ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధవుతోంది. ఇందులో భాగంగా దక్షిణాన తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశాలున్నట్టు గుర్తించారని, అందుకే ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలతో తృణమూల్‌ సీనియర్‌ నేత ఒకరు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం.

బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపైనా వారితో మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవలి హుజురాబాద్‌ ఎన్నికలపైనా తృణమూల్‌ అధినేత్రికి సంబంధిత ఏజెన్సీ పూర్తి నివేదిక అందించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ సాధించిన ఓట్ల విషయంలోనూ లోతైన అధ్యయనం చేసి మరీ నివేదిక అందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మరోపార్టీకి వెసులుబాటు ఉంటుందని బెంగాల్‌ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

బీజేపీకి వ్యతిరేకంగానే..: సుస్మిత దేవ్, టీఎంసీ ఎంపీ 
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణపై మమతా బెనర్జీ దృష్టి సారించినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. భావసారూప్యత ఉన్న నేతలు ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తృణమూల్‌ రాజ్యసభ ఎంపీ సుస్మిత దేవ్‌ ‘సాక్షి’తో చెప్పారు. ‘మమతా బెనర్జీ జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్నందున బీజేపీని సమర్థవంతంగా ఢీకొట్టేందుకు పార్టీని విస్తృతం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీ నేతలైనా మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. తెలంగాణలోనూ పార్టీ విస్తరణ ఉంటుంది. అయితే, ఇందుకు మరికొంత సమయం ఉంది’అని ఆమె పేర్కొన్నారు.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top