రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..?

TPCC President Selection Come To Final - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో మళ్లీ కదలిక

ఏఐసీసీ నేతల మధ్య చర్చలు

జాబితాలో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు

వడపోత అనంతరం ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయమై పార్టీ అధిష్టానం మరోసారి కొందరు నేతలతో సంప్రదింపులు జరిపింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా నివాసం 10 జన్‌పథ్‌కు వెళ్లి వచ్చిన తరువాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చిం చారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌లతో పాటు రాష్ట్ర నాయకులతోనూ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురి పేర్లతో ఒక తాజా జాబితాను రూపొందించారు.

పీసీసీ అధ్యక్ష రేసులో తాను లేనని శ్రీధర్‌బాబు ప్రకటించినప్పటికీ ఆయన పేరుతో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరితో సంప్రదింపులు జరిపే ప్రక్రియ కూడా ప్రారంభమయ్యిందని ఏఐ సీసీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాను మరింత వడబోసి త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిని పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. అంతకుముందు మరొకసారి పార్టీలోని కీలక, సీనియర్‌ నాయకులతో సంప్రదింపులు జరపాలని కూడా అధిష్టానం పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అనంతరం అధినేత్రి ఆమోదం తీసుకుని అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ఇతర పదవుల పైనా చర్చలు
కేవలం అధ్యక్ష పదవికి ఎంపిక మాత్రమే కాకుండా, సామాజిక సమీకరణాల ఆధారంగా నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల వంటి కీలక పదవుల భర్తీపై కూడా చర్చలు సాగుతున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మండల స్థాయి అధ్యక్షుల నియామకం కూడా వేగవంతం చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని మండలాలకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేక నూతన అధ్యక్షులను నియమించాలా అనే అంశంపై గతంలోనే సమాలోచనలు జరిగాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయిన తరువాత జిల్లా స్థాయి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు ఈసారి సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక నియామకాలు జరగనున్నాయని తెలిసింది.

జంబో కార్యవర్గానికి భారీ కోత?
ప్రస్తుతం సుమారు 60 మంది అధికార ప్రతినిధులు, 300 మందికి పైగా కార్యదర్శులు, జాయింట్‌ సెక్రటరీలు, 27 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో సైజ్‌ టీపీసీసీ కమిటీకి ఈసారి భారీగా కోత పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో ఒక అధికార ప్రతినిధి నియామకంతో పాటు పీసీసీ స్థాయిలో కేవలం 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులను మాత్రమే కొత్త కమిటీలో భాగంగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top