కేసీఆర్‌ ఇచ్చే కమీషన్లకు బీజేపీ కక్కుర్తి | TPCC Chief Revanth Reddy Strong Comments On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఇచ్చే కమీషన్లకు బీజేపీ కక్కుర్తి

Sep 9 2023 4:36 AM | Updated on Sep 9 2023 4:36 AM

TPCC Chief Revanth Reddy Strong Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఇచ్చే కమీషన్లకు బీజేపీ కక్కుర్తి పడుతోందని, అందుకే కేసీఆర్‌ అవినీతి, దోపిడీలను బీజేపీ నేతలు బలపరుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత పి.వినయ్‌రెడ్డి శుక్రవారం తన అనుచరులతో కలిసి గాందీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

‘బండి సంజయ్, కిషన్‌రెడ్డి, అరవింద్‌లను అడుగుతున్నా. దేశవ్యాప్తంగా ఐదువేలకు పైగా ఈడీ కేసులు పెట్టా రు. లక్షకు పైగా ఐటీ కేసులు నమోదు చేశారు. వేలాది కేసులను సీబీఐ విచారిస్తోంది. కానీ, కేసీఆర్‌పై ఎందుకు కేసులు పెట్టడం లేదు. మోదీ నుంచి అమిత్‌షా వరకు, బండి సంజయ్‌ నుంచి జవదేకర్‌ వరకు ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని అంటున్నారే తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?’అని నిలదీశారు. 

కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు దోచుకున్నారు 
కేసీఆర్‌ లక్ష కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి రూ.50 కోట్లు చొప్పు న రూ.500 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు జమిలీ ఎన్నికల పేరుతో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి వచ్చినా ఈసారి కాంగ్రెస్‌ గెలుపును ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌తో పాటు ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement