
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని.. అలాగే ఈ తొమ్మిది నెలల టైం ఎంతో..
సాక్షి, అమరావతి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారనే ఉత్త ప్రచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి కొట్టిపారేశారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులతో టైంకే ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టం చేస్తూనే.. ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని.. ఈ కాలం ఎంతో కీలకమని.. మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందంటూ మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా తొమ్మిది నెలలు ఉంది. కష్టపడితే మళ్లీ మనదే విజయం. ఈ తొమ్మిది నెలల కాలం మంత్రులు మరింత చొరవతో పని చేయాలి. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రభుత్వం చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజలతో మమేకం కావాలి అని ఆయన మంత్రులకు సూచించారు.
చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ తొమ్మిది నెలల కాలం పని చేయండి.. మిగతాది నేను చూసుకుంటా అని ఆయన మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు