
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది.
42 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం... తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేసేలా మా కార్యాచరణ ఉంటుంది.ఢిల్లీలో మేమంతా ధర్నా చేసిన రోజు బిఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కు చట్టబద్ధంగా చేయవలసిన పక్రియ అంతా ప్రభుత్వం చేసింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థ ల ఎన్నికల పక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బిఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంటె ఎందుకు కులగణన చేయలేదు. బీసీలు అమాయకులు కాదు...బీసీ రిజర్వేషన్ల పెంపు ఎంత కఠినమైనదో తెలుసు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియ చేపట్టాం’ అని తెలిపారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసింది. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని నిలదీశారు.
రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైంది కేటీఆర్
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం తేటతెలలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారని, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారని, కేంద్రంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిందన్నారు.
అందుకే ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం కోర్టు ఆపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక… ఎన్నికల వాయిదా కోసం బిసి రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని విమర్శించారు కేటీఆర్. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.