సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామ శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాసు మహేష్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాసు మహేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాల్మన్ అంత్యక్రియలకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి సహా పార్టీ నేతలను అడ్డగించారు. బారీకేడ్లతో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
అంత్యక్రియలకు వెళ్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటి? అంటూ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బెఠాయించారు. అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వరా అంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి చూపు కూడా చూసుకోనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాసు మహేష్‌రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్
సాల్మన్ అంత్యక్రియలను అడ్డుకోవద్దంటూ వైఎస్ జగన్ పోలీసులను హెచ్చరించారు. పిన్నెల్లి గ్రామంలోకి వైఎస్సార్‌సీపీ నేతలను అనుమతించాలన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘గురజాల నియోజకవర్గంలో 7 రాజకీయ హత్యలు జరిగాయి. పిన్నెల్లిలో 300 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. సాల్మన్‌పై దాడి చేసి చంపేశారు. తిరిగి బాధితుడిపైనే పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తాం. మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తాం. బాధితుల కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.

పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..
సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశారు.




