జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్‌ ధరలు పెంచడమా?: రేవంత్‌

Telangana: Revanth Reddy Fires On Central And State Govt Over Prices Hike - Sakshi

ధరల పెంపుపై నిరసనలు 

కరెంటు చార్జీలు తగ్గించాలని 30న ఆందోళన 

ధరలు పెంచిన వాళ్లే ధర్నాలు చేయడం విడ్డూరమని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: పేదల రక్తాన్ని పీల్చుకుని, వారి సంపాదనను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పోటీ పడి ధరలు పెంచుతున్నాయని, మళ్లీ ఆ పార్టీలవారే ధరలు తగ్గించాలంటూ ధర్నా లుచేయడం విడ్డూరంగా ఉందన్నారు.

శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ దృష్టిలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్‌ ధరలను పెంచడమా అని ప్రశ్నించారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న కారణంగా నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగలేదని, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే మళ్లీ పెరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చేత్తో ఉచితంగా ఇస్తున్నామని చెబుతూనే, మరో చేత్తో విద్యుత్‌ భారాన్ని ప్రజలపై మోపుతోందని విమర్శించారు.

విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా రూ.12 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై కేసీఆర్‌ ప్రభుత్వం మోపుతోం దని ఆరోపించారు. కరెంటు చార్జీలు తగ్గించాలని 30న ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌చైర్మన్‌ కోదండరెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, వేం నరేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. 

కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తానంటే ఏర్పాట్లు చేస్తాం 
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సీఎం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తామంటే తాము ఏర్పాట్లు చేస్తామని, కాంగ్రెస్‌ కేడర్‌ ఆయనకు రక్షణంగా ఉంటుందని రేవంత్‌ చెప్పారు. కేంద్రం వచ్చి ఐకేపీ కేంద్రాలను పెడుతుందా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, ఆ తర్వాత ఎవరికి అమ్ముకోవాల నేది దాని ఇష్టమని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో ప్రధానిని ఎందుకు కలవడం లేదని, ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంలో కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లు తమకు ఇస్తే «ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని రేవంత్‌ చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top