కొవ్విరెడ్డితో సంబంధం లేదు 

Telangana: No Transactions With Fake CBI Officer Says Minister Gangula Kamalakar - Sakshi

మంత్రి గంగుల స్పష్టీకరణ 

కేవలం రెండు గంటల పరిచయం మాత్రమే 

ఎలాంటి లావాదేవీలు లేవు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తనది కేవలం రెండు గంటల పరిచయం మాత్రమేనని, అంతకుమించి ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లో సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శ్రీనివాస్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడని, మున్నూరు కాపు సంఘంలో తిరుగుతాడని, ఐపీఎస్‌ అని విన్నానని తెలిపారు.

అంతేతప్ప తానెప్పుడూ ప్రత్యక్షంగా అతన్ని కలుసుకోలేదని అన్నారు. అయితే ఇటీవల అరెస్టుకు వారం రోజుల ముందు ధర్మేందర్‌ అనే వ్యక్తి ద్వారా ఫిల్మ్‌నగర్‌లో జరిగిన ఓ గెట్‌ టు గెదర్‌లో శ్రీనివాసరావును కలిశానని చెప్పారు. శ్రీనివాస్‌ మున్నూరు కాపు కులంలో ఐపీఎస్‌ అని గర్వంగా ఫీలయ్యామని, అతడి భార్య కూడా ఐఏఎస్‌ అని చెప్పడంతో వారిని కలిసేందుకు ధర్మేందర్‌ ద్వారా వెళ్లామన్నారు.

ఆ సందర్భంగానే ఫొటోలు దిగడం జరిగిందని తెలిపారు. తనను అతను ఎలాంటి పనులు అడగడం కానీ, తాను అతడిని అడగటం కానీ జరగలేదని అన్నారు. మరుసటి రోజు గంటపాటు మామూలుగా మాట్లాడామే తప్ప అంతకుమించి ఏమీ లేదని పేర్కొన్నారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన సమయంలో అతని ఫోన్‌లో తన ఫొటోలతో పాటు కాల్‌లిస్టులో పేరు ఉండటంతో విచారణకు పిలిచారని వివరించారు. తన బావ, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను శ్రీనివాస్‌ ఇంట్లో పెళ్లికి సాయం అడిగాడని, దాంతో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు ఇప్పించాడని, ఆ డబ్బుల బకాయి ఇంకా ఉందని చెప్పారు. శ్రీనివాస్‌తో తామెలాంటి లావాదేవీలు జరపలేదని, సీబీఐ అధికారులకు ఇదే స్పష్టం చేశామని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top