TS: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?

Telangana Khammam Paleru Politics Congress BRS YSRTP - Sakshi

ఖమ్మం జిల్లాలో పాలేరు పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటాయి. కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు వామపక్షాల బలం సైతం ఇక్కడ బాగానే ఉంది. అయితే పాలేరు కాంగ్రెస్‌కు కంచుకోట అనే చెప్పాలి. 1962లో పాలేరు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలిచాయి. గతంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పాలేరు 2009లో జనరల్ సీటుగా మారింది. 

ఒకప్పుడు వారికి కంచుకోట
నియోజకవర్గంలో మొత్తం 2,15, 631 ఓటర్లున్నారు. 2009, 2014లో కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అనారోగ్యంతో వెంకటరెడ్డి మరణించడం వల్ల జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి రామిరెడ్డి సుచరితరెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా  నిలబెట్టింది. అప్పటికే ఎమ్మెల్సీ కోటలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును అధికార TRS పార్టీ పోటీ చేయించగా ఆయన 45 వేల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు పై 7 వేల పై చిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దికాలానికే కందాల హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. 

తుమ్మల చుట్టే రాజకీయాలు
ఈ సారి జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు YSRTP నుంచి వైఎస్ షర్మిల, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, CPI నుంచి సీనియర్ నాయకుడు మౌలానా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే పాలేరు సీటుకే అధిక డిమాండ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ టీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలకు కలిసొస్తుందని అంటున్నారు.

బీ.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు కూడా షర్మిలకు మరో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా  విడిపోయి కేసులు పెట్టుకోవడం..ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం..వ్యతిరేక సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి ఘటనలు బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తుమ్మల లేదా కందాలలో ఎవరికైనా ఒక్కరికే గులాబీ పార్టీ సీటు ఇస్తుంది. దీంతో ఆటోమేటిక్గా రెండో వ్యక్తి ప్రత్యర్థిగా మారే పరిస్థితులుంటాయి. పార్టీలోని వర్గ విభేదాలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళన చెందుతోంది. 

పోలోమంటూ షిఫ్టింగ్లు
ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కలిసొచ్చే అంశం సొంత డబ్బుతో విద్యార్థులకు ఫ్రీ కోచింగ్, నియోజకవర్గంలో మరణించిన ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయం, రైతులు వెళ్లేందుకు డొంక రోడ్ల మరమ్మతులు, దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు విరాళం అందించడంతో కొంత సానుకూలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా సీపీఎం సైతం పాలేరు టిక్కెట్ ను ఆశిస్తున్నప్పటికీ గులాబీ పార్టీ మాత్రం టిక్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తుమ్మల సైతం బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొన్నటి వరకు పార్టీపై అసంతృప్తితో ఉన్న తుమ్మలను బీఆర్ఏస్ ఆవిర్భావసభ నేపథ్యంలో దగ్గరికి తీసుకుంది. మంత్రి హరీష్ రావ్ తుమ్మల ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో తుమ్మల మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను సైతం చూసుకున్నారు. పార్టీ కూడా తుమ్మలకు ప్రాధాన్యతను పెంచింది. దీంతో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటి ఇచ్చారు తుమ్మల.

అయితే తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో తుమ్మల కీలక భూమిక పోషించబోతున్నారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసీటిలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు తుమ్మల. అటు వైఎస్ షర్మిల సైతం కర్ణగిరి సమీపంలో క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా స్వగ్రామం తెల్దారుపల్లిలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు.

అసంతృప్తి రాగాలు
సామాజిక వర్గాల వారీగా చూస్తే..పాలేరులో బీసీ ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం ఎస్టీ ఓటర్లే. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలనే ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు చేపట్టలేదని ప్రజలు భావిస్తున్నారు.

గతంలో ప్రారంభించిన రోడ్ల పనులు మాత్రం పూర్తి చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోవడంతో వారిలో నిరాశ కనిపిస్తోంది. భక్త రామదాసు ప్రాజెక్ట్ క్రింద ఇంకా 10 గ్రామాలకు త్రాగు నీరు అందించాల్సి ఉంది. అది కూడ త్వరగా నేరవేర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు తేలేకపోవడంతో పాటు పార్టీ మారడం..పార్టీలో గ్రూప్ తగాదాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయంటున్నారు అక్కడి పబ్లిక్. కొందరు అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నేత అయితే షాడో ఎమ్మేల్యేగా వ్యవహరిస్తూ ఎమ్మేల్యే ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంట్రవర్సీ నేతలను కంట్రోల్ లో పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేకు మైనస్‌గా మారే ప్రమాదం ఉందని లోకల్ గా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పాలేరులో కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు ఉండగా.. బీజేపీ నుంచి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పోటీ చేసేవారి జాబితాలో ఉన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాలేరులో ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top