Huzurabad Bypoll: 61 మంది.. 92 నామినేషన్లు

Telangana: Huzurabad By Election Phase Of Nominations - Sakshi

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు చివరి రోజున భారీగా దాఖలు 

మరోసారి పత్రాలు సమర్పించిన ఈటల, జమున, వెంకట్, గెల్లు

కొనసాగిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆందోళన ఉప ఎన్నిక బరిలో 12 మంది

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం చివరిరోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈటల రాజేందర్, ఈటల జమున (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ (టీఆర్‌ఎస్‌), బల్మూరి వెంకట్‌ (కాంగ్రెస్‌) మరోసారి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా పోలీసులు హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రు లే కావడం గమనార్హం. 

కొనసాగిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరసన..! 
పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకే ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పలుమార్లు సూచించారు. నామినేషన్‌ వేయాలనుకుంటే ఆఫీసు లోపలికి వెళ్లాలని, అంతేతప్ప నిబంధనలను ఉల్లంఘించొద్దని కోరారు.

అయినా ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన కొనసాగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి హరీశ్‌రావు వచ్చిన సమయంలో.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ డౌన్‌డౌన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారి వాహనాలకు అడ్డుగా వెళ్లారు. పోలీసులు కలగజేసుకుని ఫీల్డ్‌ అసిస్టెంట్లను పక్కకు తప్పించారు. 

బరిలో 12 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 12 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు బరిలో ఉన్నారని ఫీల్డ్‌ అసిస్టెంట్ల జేఏసీ చైర్మన్‌ శ్యామలయ్య తెలిపారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి తప్పుకోబోరని చెప్పారు. జిల్లాల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లు అంతా వచ్చి ప్రచారం చేస్తారని వెల్లడించారు. 

ఈసారీ గెలుపు ఈటలదే..: జమున 
మరోసారి నామినేషన్‌ వేసిన ఈటల రాజేందర్‌ భార్య జమున మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో విజయం రాజేందర్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, ఇంతకాలం తమను ఆదరించారని, ఇప్పుడూ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయన్నారు.


నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ 

తాను ప్రతిసారీ ఈటలకు డమ్మీగా నామినేషన్‌ వేస్తుంటానని, ఈసారీ అలాగే వేశానని చెప్పారు. కాగా.. ఈటల రాజేందర్‌ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. 

నిరుద్యోగుల గళమవుతా: బల్మూరి వెంకట్‌ 
తనకు హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశమిచ్చిన రాహుల్, సోనియాగాంధీలకు కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్‌ నేతలు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి నామినేషన్‌ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగుల తరఫున తాను పోరాడుతున్నానని.. విద్యార్థులు–నిరు ద్యోగుల గళంగా నిలుస్తానని వెంకట్‌ చెప్పారు.

రైతుల ఉసురు తీసే బీజేపీకి ఎందుకు ఓటేయాలి: హరీశ్‌
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డిలతో హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు.. నామినేషన్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌ వ్యక్తిగత స్వార్థంతోనే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని హరీశ్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 70 శాతం వ్యవసాయాధారిత కుటుంబాలే అని.. రైతుల సంక్షేమం ఏమాత్రం పట్టని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.


నామినేషన్‌ దాఖలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి 

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ, ఆసరా పింఛన్లు, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ఎన్నో చేపట్టామన్నారు. ‘‘బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణమైనా చెప్పగలరా? యూపీలో రైతులను నడిరోడ్డుపై వాహనాలతో తొక్కించినందుకు వేయాలా? రైతులను లాఠీలతో చితకబాదినందుకు వేయాలా? రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినందుకు వేయా లా? ప్రభుత్వ రంగం సంస్థలను కార్పొరేట్లకు అమ్ముకుంటున్నందుకు వేయాలా? బీసీ, ఎస్సీ–ఎస్టీల రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర పన్నుతున్నందుకా?’’అని హరీశ్‌ ప్రశ్నించారు. వంట గ్యాస్‌ ధర రూ.1,000కి చేరిందని.. పెట్రోల్, డీజిల్‌ ధరల ను అడ్డగోలుగా పెంచేశారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top