పేదల కోసమే కొట్లాడుతా

Telangana: Etela Rajender Comments On CM KCR And Harish Rao - Sakshi

ఇజ్జత్‌ లేని బతుకు వద్దనే రాజీనామా చేశా : ఈటల

ప్రగతిభవన్‌లో కుట్రలు హుజూరాబాద్‌లో అమలు 

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తుదిశ్వాస వరకు పేదల వైపే ఉంటానని వారి కోసమే కొట్లాడు తానని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో కూర్చొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పన్నిన కుట్రలను ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్‌లో అమలుపరుస్తున్నారని, త్వరలోనే ఆయనకు కూడా కనువిప్పు కలుగుతుందన్నారు.

జమ్మికుంటలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆయన ప్రచారం చేశారు. ఈటల మాట్లాడుతూ ఇజ్జత్‌ లేని బతుకువద్దని, పూలమ్మిన చోటే కట్టెలమ్మ వద్దనే కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకొచ్చానని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు దళితులపై నిజమైన ప్రేమేఉంటే వారికి మూడెకరాల భూమిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి లాంటి అత్యుత్తమ అధికారులు కేసీఆర్‌ కుట్రల్ని భరించలేకే రాజీనామాలు చేశారని ఆరోపించారు.

సీఎం డబ్బు సంచులకు, మద్యానికి ఇక్కడి ప్రజలు బానిసలుగా ఉండరని, ఈ నెల 30న టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కాగా, జమ్మికుంటలో నిర్వహించిన ప్రచారం లో ఎన్నికల నిబంధనలు, భౌతికదూరం పాటించలేదనే ఫ్లయింగ్‌స్క్వాడ్‌ ఫిర్యాదు మేరకు ఈటలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాంచందర్‌రావు తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top