భూపోరాటం ఉధృతం చేయాలి

Telangana: CPI National Secretary Narayana Comments On BJP Party - Sakshi

బీజేపీ తాటాకు చప్పుళ్లు ఎక్కువయ్యాయి 

నిలువరించకుంటే పామై కరుస్తుంది  

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను 

పారదోలేందుకు మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్మించాలి: చాడ   

వ్యవసాయ కార్మిక సంఘం ముగింపు మహాసభ 

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: దేశంలో మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బీజేపీ తాటాకు చప్పుళ్లు ఎక్కువయ్యాయని, వాటిని నిలు వరించటంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి, లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం వారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే.. అది పామై కరుస్తుందని హెచ్చరించారు. గురువారం మేడ్చల్‌ జిల్లా కీసరలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ముగింపు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం భూపోరాటాలను ఉధృతంగా నిర్వహించాలని చెప్పారు.  

ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలే: చాడ  
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ ప్రధాని మోదీ తిరోగమన నిర్ణయాలతో పేదల బతుకులు ఛిద్రం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల హక్కుల కోసం పోరాడేది కేవలం కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాన్ని మించింది లేదని, ఇటీవలే చిలీ దేశాధ్యక్షుడిగా వామపక్ష పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తోంది.

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటోంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించడంలో, నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి వారి హక్కులను కాలరాస్తోంది’అని ధ్వజమెత్తారు.  

ధరణిలో లొసుగులు 
రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాల అమలు తరువాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ధరణి పోర్టల్‌లో కూడా అనేక లొసుగులు ఉన్నా యని చాడ ఆరోపించారు. ‘దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న హామీని టీఅర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్న హామీని కూడా అటకెక్కించింది. ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని టీఅర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పారదోలేందుకు మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముంది.

ప్రజలను చైతన్యపరుస్తూ రైతులు, కార్మికులు ఉమ్మడిగా తమ హక్కుల కోసం ఉద్యమించాలి’అని అన్నారు. కార్యక్రమంలో భారతీయ కేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే పెరియస్వా మి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్‌.బాలమల్లేశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకండ్ల కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కాంతయ్య 
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర నూతన కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొండం కాంతయ్య ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఎన్‌.బాలమల్లేశ్‌ ఎన్నికయ్యారు. 71 మంది సభ్యులతో నూతన కౌన్సిల్‌ ను, 21 మందితో కార్యవర్గాన్ని, 11 మందితో ఆఫీసు బేరర్లను ఎన్నుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top