మేమింతే.. మా స్టయిల్‌ ఇంతే!

Telangana Congress leaders are Limited to Their Own Constituencies - Sakshi

సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్న కాంగ్రెస్‌ నేతలు 

పార్టీ పదవులున్నా పెద్దగా ఉపయోగించుకోని వైనం 

వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నుంచి ఏఐసీసీ కార్యదర్శుల దాకా అదే పరిస్థితి 

సీనియర్‌ మంత్రులుగా చేసినవారు సైతం వారి సెగ్మెంట్‌కే పరిమితం

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకుని రావడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు తరచూ చెబుతున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. సొంత నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలపైనే సీనియర్‌ నేతలు దృష్టి పెడుతూ, ఇతర నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు దాదాపు శూన్యమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్‌ నేతలు క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటిస్తేనే కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నెలకొంటుందని పేర్కొంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు కూడా ప్రజల్లో ఎక్కు వగా కనిపించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కొద్దిరోజులుగా పార్టీ సంస్థాగత పనితీరుపై తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లోనూ సీనియర్‌ నేతలపై అదే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.  

నియోజకవర్గాలకే పరిమితం.. 
సీనియర్‌ నేతలు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, కొండా సురేఖ, మహేశ్వర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మధుయాష్కీ, గీతా రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, జీవన్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేతలు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప పెద్దగా ఎక్కడా పర్యటించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఎంపీలుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప పెద్దగా జిల్లాల్లో పర్యటించడంలేదని ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాల కారణంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి కొడంగల్‌పై ఫోకస్‌ చేయలేదని, ఇటు మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోనూ నేతలకు పెద్దగా సమయం ఇవ్వడంలేదన్న వాదన కూడా వినిపిస్తోంది.  

వర్క్‌ అవుట్‌ చేయని వర్కింగ్‌ ప్రెసిడెంట్లు 
వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు ఉన్న ఐదుగురిలో ఆర్గనైజేషన్‌ వ్యవహారాలు చూస్తున్న మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఓ మోస్తరు పర్వాలేదని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్న అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఇంకా గ్రేటర్‌ అధ్యక్షుడిలాగే పనిచేస్తున్నారని, అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంలేదన్న వాదన వినిపిస్తోంది. గీతారెడ్డి పెద్దగా ఫోకస్‌ చేసినట్టు కనిపించడం లేదని నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తప్ప ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఆయన సంగారెడ్డికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రెండోసారి అవకాశం లభించిన అజహరుద్దీన్‌ అసలు ఎక్కడ పర్యటిస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం షబ్బీర్‌ అలీకి వ్యతిరేకంగా కామారెడ్డిపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. అటు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లలోనూ ఒకరిద్దరు మినహా మిగిలినవారి పనితీరు సంతృప్తిగా లేదని అధిష్టానానికి నివేదిక సైతం పంపించినట్టు తెలుస్తోంది.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top