కేసీఆర్‌ ఒప్పుకుంటే ఫామ్‌హౌజ్‌లోనే మాక్‌ అసెంబ్లీ: సీఎం రేవంత్‌ | Telangana CM Revanth Reddy Challange KCR Farmhouse Debate | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఒప్పుకుంటే ఫామ్‌హౌజ్‌లోనే మాక్‌ అసెంబ్లీ: సీఎం రేవంత్‌

Jul 9 2025 8:06 PM | Updated on Jul 10 2025 7:52 AM

Telangana CM Revanth Reddy Challange KCR Farmhouse Debate

నేనెవరికీ చాలెంజ్‌లు విసరలేదు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని మాత్రమే పిలిచాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే.. కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయితీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి అంటూ సీఎం రేవంత్‌ సెటైర్లు సంధించారు.  

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న సవాళ్ల పర్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు కేసీఆర్‌ను సభను రమ్మనే తాను సూచించానని, తానెవరికీ సవాళ్లు విసరలేదని అన్నారాయన. బుధవారం ప్రగతి భవన్‌లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏండ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ శాఖను చూశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు దొరక్కపోతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌కు నేనేం సవాల్ విసరలేదు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చట్ట సభల్లో చర్చ జరుపుదాం.. రండి అని అన్నాను అంతే. 

👉కేసీఆర్‌ ఎప్పుడంటే అప్పుడు సభ పెడతాను. ప్రాజెక్టుల పై అసెంబ్లీలో చర్చ జరుపుదాం. ప్రత్యేకమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల పై అవగాహన ఉన్న నిపుణులను సైతం చర్చకు పిలుద్దాం. అసెంబ్లీ స్పీకర్‌కు కేసీఆర్ లేఖ రాస్తే చర్చకు మేము సిద్ధం. మీరు పదేళ్లలో చేసింది.. ఏడాదిన్నర కాలంలో మేము చేసింది ఏంటో చర్చ పెడదాం. సభలో ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా బాధ్యత నేను తీసుకుంటా. సభ ప్రశాంతంగా జరిపేలా నేను చూసుకుంటా. కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తే స్వీకరిస్తాం. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.

👉కేసీఆర్ మా సవాళ్లను స్వీకరించాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపుతాం. కేసీఆర్ ఒప్పుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ పెడతాం. కేసీఆర్ పిలిస్తే నేను సైతం ఫామ్ హౌస్‌కు వస్తాను. డేట్‌, ప్లేస్‌ మీరు చెప్పినా సరే.. మేమైనా చెప్తాం. కానీ, క్లబ్ లు, పబ్‌లు అంటే మాకు కష్టం. గతంలో ఎన్నో చాలెంజ్‌లు చేశాం. కానీ, క్లబ్బులు, పబ్బుల కల్చర్‌కు నేను దూరం. నన్ను పిలవొద్దు. 

👉ప్రజా భవన్ లో మీటింగ్ పెట్టినా BRS ఒప్పుకోవడం లేదు. ప్రజా భవన్ లో ఎలా పెడతారు? అని హరీష్ రావు అంటున్నారు. ప్రజా భవన్ ప్రజల కోసమే ఉంది..అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయతీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి. 

👉స్టేక్ ఓల్డర్లతో త్వరలో PPT పెడతాం. ఏపీ సీఎంకు సూచనలు చేస్తున్న. వరద జలాల్లో లెక్కలు తేల్చుకుందాం. వరద జలాల లెక్కలు తేల్చిన తరువాత పైన మేము కట్టుకుంటాం..కింద మీరు కట్టుకోండి. మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా మిగులు జలాలు అంటే ఎలా?. నికర, మిగులు జలాల పై కేంద్రం వద్ద చర్చ జరుపుకుందాం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే చూస్తూ ఊరుకోం. మీరు ఎవరు మాకు సలహాలు ఇవ్వడానికి. కృష్ణా, గోదావరి జలాల కోసం కోట్లాడుతాం. కృష్ణా, గోదావరి జలాల పై తెలంగాణను తాకట్టు పెట్టం. తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదురిస్తాం.

👉కొంతమంది పేరును ప్రస్తావించినా నా స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుంది. బేసిన్లు భేషజాలు లేవని.. రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు లేదు. జూరాల నుంచి నీళ్లు తేవాలని చిన్నారెడ్డి అసెంబ్లీలో అంటే.. కేసీఆర్ ఆయన్ను అవమానించారు. రెండు టీఎంసీ లు ఉన్న పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీ కేసీఆర్ తగ్గించారు. కృష్ణాజలాల పై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. 

👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ వెయ్యి రెట్లు ద్రోహం చేశారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లను ఏపీ తీసుకుపోతోంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టను కేసీఆర్ ఎందుకు తొలగించారు?. రంగారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షలు, నల్గొండ తో కలిపి ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కేసీఆర్ తొలగించారు. కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ కు ఎందుకు తేలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. అనాడు రాజశేఖర్ రెడ్డి నీళ్లు తెస్తానని టెండర్లు పిలిస్తే.. కేసీఆర్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశారా ? అలాంటప్పుడు బేసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ ఎలా చెప్తారు?. వాస్తవాలు చర్చ జరుపుదాం అంటే కేసీఆర్ రావడం లేదు అని రేవంత్‌ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement