పంచాయతీలకు ప్రతినెలా నిధులు

Telangana: CM KCR Speaks On Gram Panchayat Funds - Sakshi

శాసనసభలో సీఎం కేసీఆర్‌

నిధుల దారి మళ్లింపు అవాస్తవం

పల్లె ప్రగతిపై చర్చకు రావాలని సవాల్‌

బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ విపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పంచాయ తీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నా మని తెలిపారు. కేంద్రం దయాదాక్షిణ్యంగా ఏ విధమైన నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రం హక్కుగానే నిధులు ఇస్తోందని చెప్పారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి వచ్చే నిధులకు సమానంగా రాష్ట్రమూ నిధులిస్తోందన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై చేతనైతే సుదీర్ఘ చర్చకు రావాలని కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు.

ఖర్చు చేసే ప్రతి పైసకు లెక్క చెబుతామన్నారు. రాష్ట్రం లో గ్రామ పంచాయతీల పురోగతిని కేంద్రమే ప్రశంసించిందని ఆయన గుర్తుచేశారు. శాసన సభలో కాంగ్రెస్‌ పక్ష సభ్యులు సీతక్క, డి.శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్క ప్రభృతులు నిధుల మళ్లింపు అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి ఎర్రబెల్లి వారికి సమాధానం చెప్పారు. అనంతరం సీతక్క అనుబంధ ప్రశ్న వేశారు.

నిధుల వివరాలు చెప్పండి
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, దీనివల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని సీతక్క అన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మానసిక ఆవేదన చెందిన సర్పంచ్‌లు పలు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేయలేదని కలెక్టర్లు, డీపీవోలు వారిని అవమానిస్తున్నారని ఆమె సభ దృష్టికి తెచ్చారు.


గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులెంతో చెప్పాలని నిలదీశారు. ఈ నిధులు గ్రామాభివృద్ధికి సరిపోతున్నాయో లేదో తెలపాలన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ వల్ల వచ్చే నిధులు సరిగా పంచాయతీలకు అందడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడేళ్ల నుంచి రాష్ట్రానికి రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చాయని, వీటిని దారి మళ్ళించింది వాస్తవమా కాదా తెలపాలని భట్టి అన్నారు. 

సమన్యాయం ప్రభుత్వ విధానం : కేసీఆర్‌
కొన్ని పంచాయతీల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుందని, మరికొన్ని పంచాయతీలకు ఏమాత్రం ఆదాయం ఉండదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తలసరి నిధుల కేటాయింపు కేవలం రూ.4 మాత్రమే ఉంటే, ఇప్పుడు తాము రూ.654 పైచిలుకు ఇస్తు న్నామని తెలిపారు.

ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. వాస్త వాలు వక్రీకరించడం కాంగ్రెస్‌ సభ్యులకు తగదన్నారు. తెలంగాణ గ్రామాలను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినవారు పులకించి పోతున్నారని, ఇది కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ పంచాయతీల నిధులు ఆపొద్దని తాను ఆదేశించినట్టు తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top