ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్‌ చేస్తాం  | Sakshi
Sakshi News home page

ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్‌ చేస్తాం 

Published Tue, Jun 21 2022 1:53 AM

Telangana: BJP CHIEF Bandi Sanjay Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 2, 3 తేదీల్లో ,తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభను సక్సెస్‌ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈనెల 3న హైదరాబాద్‌లో 10 లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 34 వేల పోలింగ్‌ బూత్‌ల నుంచి కార్యకర్తలు, కేంద్ర పథకాల లబ్ధిదారులతోపాటు సామాన్యులు ఈ సభకు తరలొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

జాతీయకార్యవర్గ భేటీకి సంబంధించి నోవాటెల్‌ హోటల్లో చేస్తున్న ఏర్పాట్లను సోమవారం సంజయ్, సమావేశ ఏర్పాట్ల ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్, పార్టీ నేతలు రామచందర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చాడ సురేశ్‌రెడ్డి, బంగారు శ్రుతి, కొల్లి మాధవి, జె.సంగప్ప పరిశీలించారు. అనం తరం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ సర్కా ర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పన్నులభారం మోపుతూ ప్రజలను రాచి రంపాన పెడుతోంది.

దీనిపై బీజేపీ బెదరకుండా అనేక పోరాటాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో బీజేపీపట్ల మరింత విశ్వాసం పెంచేందుకు ఈ సమావేశాలు జరగుతున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా జాతీయ నాయకత్వమంతా హైదరాబాద్‌లో రెండ్రోజులుండటం కార్యకర్తలకు మరింత భరోసాను ఇస్తుంది’అని సంజయ్‌ వెల్లడించారు. అంతకుముందు సంజయ్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని  సహా ఇతర జాతీయ నేతలకు సంబంధించిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు.  

భేషజాలకు పోవద్దు.. బాసరకు పోవాలి 
రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను సంజయ్‌ కోరారు. విద్యార్థుల డిమాండ్లపై చర్చలు జరపకుండా వారి ఆందోళనలకు రాజకీయాలు ఆపాదించడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. 7 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా స్పందించకుండా కేసీఆర్‌ మరో ‘‘నీరో చక్రవర్తి’’గా వ్యవహరిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. వర్సిటీకి శాశ్వత వీసీ ఉండాలని, విద్యార్థులు కోరుతున్న మొత్తం 12 డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరింపదగినవేనని సంజయ్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement