టీడీపీలో ‘విద్యార్హతల’ చిచ్చు!.. పట్టాభిరాంపై ఫైర్‌

TDP Senior Leaders Fires On Pattabhiram - Sakshi

ఆ పార్టీ నేత పట్టాభిపై సీనియర్లు ఫైర్‌ 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్లు ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఫైర్‌ అవుతున్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా కార్యాలయంలో మీడియా ఎదుట కూర్చుని ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ పార్టీని, నాయకులను బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (కేపీ) విద్యార్హత గురించి తీవ్ర పదజాలంతో పదే పదే ప్రస్తావించడం పార్టీకి తలవంపులు తెచ్చేవిధంగా ఉందని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పట్టాభి తీరు చూస్తుంటే తమ విద్యార్హతలను కూడా ఏదో విధంగా తెరపైకి తెచ్చి అందరి నోళ్లలో నానేలా చేయాలనే దురుద్ధేశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. 

సెల్ఫ్‌ గోల్‌.. 
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ విద్యార్హత గురించి అంతగా గుచ్చి గుచ్చి మాట్లాడటమంటే పరోక్షంగా ఎంపీ కేశినేని నానిని ఎద్దేవా చేయడమేనని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఎంపీ విద్యార్హత కూడా పదో తరగతే. తన ఎన్నికల అఫిడవిట్‌లో పది పాస్‌ అయినట్లు పేర్కొన్నారు. అంతేకాదు బొండా ఉమామహేశ్వరరావు ఎనిమిదో తరగతి పాస్‌ అయినట్లు చూపారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకటేశ్వరరావు (వెంకన్న) అయిదు వరకు చదివినట్లు పేర్కొన్నారు. టీడీపీకే చెందిన పెనమలూరు, కైకలూరు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జయమంగళ వెంకటరమణలు పదో తరగతి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎనిమిది వరకు చదివినట్లు వారి ఎన్నికల అఫిడవిట్‌లలో స్పష్టంగా తెలిపారు.

టార్గెట్‌ కేశినేని! 
తమ ఎంపీ కేశినేని నాని, నగరంలోని ఇతర సీనియర్ల విద్యార్హతలను పరోక్షంగానైనా తెరపైకి తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ విధంగా విమర్శలు చేసినట్లు స్వపక్షీయులు అభిప్రాయపడుతున్నారు. క్వారీ రగడ గురించి మాట్లాడటం, అందులో లోపాలను ఎత్తిచూపడం వరకు అభ్యంతరం లేదంటున్నారు. పట్టాభి తీరువల్లే లోకేశ్‌ చదువు గురించి తాజాగా చర్చనీయాంశంగా మారిందంటున్నారు.

అధికార ప్రతినిధిగా బాధ్యతలను పార్టీ అప్పగిస్తే దాన్ని స్వపక్షీయుల మీదే తన వ్యక్తిగత రాజకీయ విభేదాలకు వాడుకుంటున్నారని, దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎంపీ వర్గీయులతో పాటు సీనియర్‌ నేతలు ఉన్నట్లు సమాచారం. ‘అతను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో, ఏయే వ్యవహారాలు ఎలా చక్కబెట్టాడో మాకు తెలియకేమీ కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. లెక్కలన్నీ సరిపోతాయి’ అని కేశినేని ముఖ్య అనుచరుడు ‘సాక్షి’వద్ద అభిప్రాయపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top