
సాక్షి, అమరావతి: శాసన మండలి సమావేశాలను తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజు మంగళవారమూ అడ్డుకున్నారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ పేరుతో రచ్చ చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వ వివరణ తర్వాత అభ్యంతరాలుంటే మాట్లాడాలని మంత్రులు చెప్పినా వినకుండా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నినాదాలతో సభను సాగనివ్వలేదు. మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం వివరణ ఇచ్చాక, మంత్రి వివరణను పరిగణనలోకి తీసుకోరని, మండలిలోనూ సీఎంతోనే వివరణ ఇప్పించాలని అన్నారు.
యనమల తీరును తప్పుబట్టిన వైఎస్సార్‌సీపీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలిలో సంబంధిత మంత్రి స్టేట్‌మెంట్ వద్దనడం సరికాదని, చైర్మన్ చెప్పిన తర్వాత కూడా మంత్రి వివరణ ఇవ్వకుండా అడ్డుకోవడం చైర్‌ను అవమానించడమేనని అన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన యనమల సభలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్నే తన వివరణగా ఇచ్చానని, రెండూ ఒక్కటేనని, టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మండలిలోనూ ప్రభుత్వం తరపున అధికారిక వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని నాని ప్రకటించారు. వివరణను వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేకపోగా చర్చ పేరుతో రచ్చ చేయడాన్ని బట్టే వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. టీడీపీ తీరుపై మంత్రులు బొత్స, కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన పీడీఎఫ్, బీజేపీ సభ్యులు
ఒకే అంశంపై 2 రోజులుగా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఎన్నో అంశాలపై చర్చించాలని సభకు వస్తామని, ఇలా చేయడం సరికాదని, తమకు మాట్లాడే అవకాశం లేకుండా హక్కులను హరిస్తే ఎలా అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రçహ్మణ్యం ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, నారాయణరెడ్డి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కత్తి నర్శింహారెడ్డి మాట్లాడుతూ సభలో తమకు మాట్లాడే అవకాశం లేకుండా చేయడం సరికాదన్నారు. మండలిలో ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు రాకుండా టీడీపీ సమయం వృథా చేసిందని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు.