సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు: వాసుపల్లి గణేశ్‌

TDP MLA Vasupalli Ganesh Praises CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా పాలనతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీవైపు ఆకర్షితులతున్నారు. యువతీయువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేశ్‌ ఇద్దరు కుమారులు సీఎం జగన్‌ సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుల్లి గణేశ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేశ్‌ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారులు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు. ఆయన ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. టీడీపీ ఇక ముందుకు వస్తుందని నాకు అనిపించడం లేదు’అని పేర్కొన్నారు.
(చదవండి: ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు)

ప్రతిపక్షం ఉంటే కదా
వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం చాలా మంచిదని పేర్కొన్నారు. వాసుపల్లి గణేష్ కుమారులు పార్టీలోకి రావడం బలాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో విద్యావంతులు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలోకి చాలా మంది వస్తారని జోస్యం చెప్పారు. విశాఖలో టీడీపీ తుడుచుపెట్టుకు పోతుందనడంలో సందేహం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని అన్నారు.
(చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top