Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు | Sakshi
Sakshi News home page

Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు

Published Fri, Dec 9 2022 6:42 PM

TDP Leader Paritala Sunitha, Sriram Eye on Penukonda Assembly Constituency - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్‌ ట్రిక్స్‌ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్‌ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే!  

సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది.  

రాప్తాడుకు రాం..రాం..
రాప్తాడుపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. 

ధర్మవరం.. అయోమయం 
రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా పరిటాల శ్రీరామ్‌ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్‌ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. 

పెనుకొండ.. కష్టమేనంట 
బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

శ్రీరామ్‌ చీప్‌ ట్రిక్స్‌..  
పరిటాల శ్రీరామ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక..   ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు)

అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. 
రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్‌సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్‌ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు)

Advertisement
Advertisement