అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..!

TDP Leader Kuna Ravikumar Defied Chandrababu Orders - Sakshi

చంద్రబాబు ఆదేశాలకు జిల్లా పార్టీ అధ్యక్షుడే ‘తూచ్‌’

భార్య తరఫున ప్రత్యక్షంగా ప్రచారం చేసిన కూన రవికుమార్‌

టీడీపీ అధిష్టానం ఆదేశాలు పట్టని స్థానిక నేతలు 

ఎన్నికలు వద్దన్నా... అంతా ఉల్లంఘనులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల బహిష్కరణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమారే ధిక్కరించారు. చంద్రబాబు చెప్పినట్టుగా తాము వ్యవహరించాల్సిన అవసరం లేదన్నట్టుగా పరిషత్‌ ఎన్నికల బరిలో ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎన్నికలు బహిష్కరించాలని ప్రెస్‌మీట్‌ పెట్టి మరోవైపు తన నియోజకవర్గంలో బరిలో ఉన్న వారందరినీ ప్రచారం చేయించడంలో కూన రవికుమార్‌ ఘనత వహించారు. తన సొంత గ్రామమైన ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని కోటిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ పరిధిలో తన భార్య కూన ప్రమీల తరఫున ఆది వారం నేరుగా ఆయన ప్రచారం చేశారు. ఇదే బాటలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుపై తిరుగుబావుటా ఎగురవేసి ఎన్నికల బరిలో నిలబడతామంటున్నారు.

కాదంటే అవుననిలే...  
టీడీపీ డ్రామాలాడే పార్టీ అని మరోసారి నిరూపించుకుంది. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అదే విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో ఆ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో తాము భిన్నమని ఆ పార్టీ నేత లు నిరూపిస్తున్నారు. చెప్పిందేదీ చేయమన్నట్టు గా సాక్షాత్తూ కూన రవికుమారే అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేశారు.

ఒకవైపు పార్టీ శ్రేణులంతా ఎన్నికలు బహిష్కరించాలని పిలుపుని చ్చి మరోవైపు తన భార్య ప్రమీల పోటీ చేస్తున్న పొందూరు మండలంలోని కోటిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఆదివారం ప్రచారం చేపట్టారు. కేడర్‌కు ఒక పిలుపునిచ్చి, ఆ పిలుపును తానే విస్మరించి ప్రచారం చేయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. ఇక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం, కళా వెంకటరా వు నియోజకవర్గమైన ఎచ్చెర్ల, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట తదితర నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పెట్టి పోటీ చేయాలని తీర్మానాలు చేసుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి:
చంద్రబాబుపై ‘తిరుగు’బావుటా!  
ఇక సన్యాసమే శరణ్యమా!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top