చంద్రబాబుపై ‘తిరుగు’బావుటా!

TDP Leaders And Activists Angry Over Chandrababu Naidu - Sakshi

అధినేతపై భగ్గుమంటున్న సీనియర్లు, ఎమ్మెల్యేలు

బహిరంగంగానే నేతల ఆగ్రహావేశాలు

టీడీపీలో బలం పుంజుకుంటున్న అసమ్మతి స్వరం

చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై కార్యకర్తల మండిపాటు 

ఓడతాం.. అయినా సరే పోటీచేస్తామని స్పష్టీకరణ

ఎంతవరకైనా వెళ్తామని అధిష్టానానికే హెచ్చరికలు

టీడీపీలో కీలక మార్పుల దిశగా జోరందుకున్న ఊహాగానాలు

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం రోజురోజుకీ ముదురుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటు బలోపేతమవుతోంది. ఓటమి భయంతో పరిషత్‌ ఎన్నికల బరి నుంచి పలాయనం చిత్తగించిన ఆయనపై పార్టీలో చెలరేగిన ధిక్కార స్వరం మరింత బలం పుంజుకుంటోంది.

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకూ చంద్రబాబుపై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఆనాడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీని చంద్రబాబు అవమానించారని.. ఆత్మన్యూనతలోకి నెట్టేశారని.. చివరికి శూన్యత మిగిల్చారని వారంతా భగ్గుమంటున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టుకుని మరీ చంద్రబాబు రాజకీయ దివాళాకోరుతనంపై మండిపడుతున్నారు. ‘పార్టీని నడిపించే వాడు నాయకుడుగానీ ఎన్నికల బరి నుంచి జారుకునేవాడు కాదు’.. అని టీడీపీ కేడర్‌ ఎద్దేవా చేస్తోంది.  

స్థానిక ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్నే బహిష్కరిస్తున్నామని నేతలు తేల్చిచెబుతున్నారు. అవసరమైతే ‘ఎంతవరకైనా’ వెళ్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసినా ఆత్మస్థైర్యాన్ని కాపాడుకునేందుకు పోటీచేసి తీరుతామని పార్టీ శ్రేణులు స్పష్టంచేస్తున్నాయి. దీంతో.. చంద్రబాబుకు వ్యతిరేకంగా 2019 నుంచి టీడీపీలో అంతర్గతంగా రగులుతున్న అసమ్మతి కట్టలు తెంచుకుంటూ పార్టీలో కీలక మార్పుల దిశగా పరిణామాలు ఊపందుకుంటున్నాయి. 

నాడు కుట్ర.. నేడు తిరుగుబాటు!
1995లో ‘వైస్రాయ్‌ హోటల్‌’ కేంద్రంగా జరిపిన కుట్ర ద్వారా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును చంద్రబాబు అధికారం నుంచి తొలగించి అడ్డదారిలో సీఎం అయ్యారు. అందుకు భిన్నంగా నేడు చంద్రబాబుపై పార్టీలో బహిరంగంగా తిరుగుబాటు మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న ఆయన నిర్ణయం ఎదురుతిరిగింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ శుక్రవారమే ధిక్కార స్వరం వినిపించగా.. శనివారం మరికొంతమంది నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ అంతటా ఇదే ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది. 

► పరిషత్‌ ఎన్నికల నుంచి తప్పుకోవడం ముమ్మాటికీ తప్పేనని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం కుండబద్దలు కొట్టారు. 
► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు తదితరులు చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. 
► తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తుని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు తదితరులు కూడా సమావేశాలు నిర్వహించి చంద్రబాబు నిర్ణయం పార్టీకి ఆత్మహత్య సదృశ్యమని దుయ్యబట్టారు. 
► కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 
► కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 
► విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణమూర్తి, గండి బాబ్జీ, చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. 
► ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ అధినేత నిర్ణయాన్ని పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదించేదిలేదని.. తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని వీరంతా తేల్చిచెప్పారు. 
► మరికొందరు సీనియర్‌ నేతలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

ఓడతాం.. కానీ పోటీచేసి తీరుతాం
‘ఆ తండ్రీ కొడుకులకు ఏం పోయింది.. ఓడిపోయి హైదరాబాద్‌లో కూర్చున్నారు. కానీ, మేం గెలిచినా ఓడినా ఊళ్లలోనే ఉండాలి కదా’.. అని అధ్యక్షుడిపై తమ్ముళ్లు మండిపడుతున్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఘోర పరాభవం తప్పదని.. కానీ, గెలుపు కంటే ఎన్నికల్లో పోటీచేయడం రాజకీయ పార్టీగా తమ ధర్మమని చెబుతూ రాజకీయ పోరాట స్ఫూర్తిలేని చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించలేరని ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఓటమి తప్పదని తెలిసినా సరే తాము మాత్రం పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వద్ద వారు తేల్చిచెబుతున్నారు. అసలే చంద్రబాబు అసంబద్ధ నిర్ణయంపై రగలిపోతున్న పార్టీ నేతలు కార్యకర్తల ఒత్తిడితో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ అభ్యర్థులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే..
► చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు ద్విముఖ వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. కొందరు అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేనతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా జిల్లాలో 70 శాతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉంటామని తేల్చిచెప్పారు. అనపర్తి, పిఠాపురం, రాజానగరం, మండపేట నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు తాము పోటీచేస్తున్నామని ప్రకటించారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు జనసేనతో జట్టు కడుతున్నారు. 
► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు చంద్రబాబు నిర్ణయంతో సంబంధంలేదని.. పోటీచేయాలని అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యన్నారాయణ తమ్ముళ్లకు చెప్పడం గమనార్హం. ఇక.. చంద్రబాబు మాటలను పట్టించుకోవద్దని, దెందులూరు మండలంలో టీడీపీ నేతలు తమకు నచ్చిన విధంగా చేసుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రకటించారు. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి పోటీకి సిద్ధమయ్యారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద శనివారం సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు. నరసాపురం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి పోటీలో ఉండటానికి నిర్ణయించి శనివారం ప్రచారం నిర్వహించారు. 
► ఇక సొంత జిల్లాలోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. ఏకంగా 15 మండలాల్లో టీడీపీ అభ్యర్థులు అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తూ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. రామచంద్రపురం, తవణంపల్లె, గుడిపాల, చిత్తూరు రూరల్, నగరి, సత్యవేడు, నారాయణవనం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, నిమ్మనపల్లె, పెనుమూరు, కురబలకోట, పాలసముద్రం తదితర మండలాల్లో పోటీచేస్తామని తమ్ముళ్లు స్పష్టంచేశారు. 
► అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ప్రకటించారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మండలంలో పోటీలో ఉంటానంటూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రకటించి ప్రచారం నిర్వహించారు. 
► చంద్రబాబు నిర్ణయం కర్నూలు టీడీపీనీ కుదిపేస్తోంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడదామన్న సీనియర్‌ నేతలు కోట్ల, కేఈ కుటుంబాలపై వారి అనుచరులు ఎదురుతిరిగారు. పత్తికొండలో పార్టీ ఇన్‌చార్జి కేఈ శ్యామ్‌బాబు పత్తాలేకుండా పోయినప్పటికీ తాము పోటీచేస్తామని టీడీపీ అభ్యర్థులు చెబుతున్నారు. ఆలూరులో కూడా పార్టీ ఇన్‌చార్జ్‌ కోట్ల సుజాతమ్మ పోటీ వద్దని చెప్పినా సరే అభ్యర్థులు ససేమిరా అని బరిలో నిలిచారు. నందికొట్కూరులోనూ ఇదే పరిస్థితి.
► విశాఖ జిల్లా పెందుర్తి, చోడవరం మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉంటామని ప్రకటించారు. 
► నెల్లూరు జిల్లా కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు శనివారం సమావేశమై ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు. 
► గుంటూరు జిల్లా వేమూరు, వినుకొండ, పెదకూరపాడు, ప్రత్తిపాడు, తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి పోటీ చేయాలని నిర్ణయించారు. 

టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
ఇక పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పు గోదవరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అ«ధ్యక్షుడు ఎస్‌విఎస్‌ అప్పలరాజు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం, ముక్కొల్లు, రామకృష్ణాపురం, గోనాడ, భూపాలపట్నం గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పార్టీకి రాజీనామా చేశారు. 

వైఎస్సార్‌సీపీలోకి చేరికలు..
మరోవైపు.. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు నేతలు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. కార్యకర్తలకు గౌరవం ఇస్తున్నందునే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామని ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి టీడీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు నారాయణస్వామి, అన్నయ్య, భూలక్ష్మి, తంగమణి ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే, విశాఖ జిల్లా కశింకోట జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన బుదిరెడ్డి చిన్నాతోపాటు వివిధ మండలాలకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

పార్టీలో మార్పులపై ఊహాగానాలు
ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీలో పరిణామాలు వేగం పుంజుకున్నాయని ఆ పార్టీ నేతలే అంతర్గంగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో పరిషత్‌ ఎన్నికల్లో పోటీ అంశంతోపాటు.. పార్టీలో భవిష్యత్‌ మార్పులపైనా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీచేయకూడదన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చంద్రబాబు స్వయంగా కొందరు పార్టీ నేతలకు ఫోన్లుచేసి మరీ ఒప్పించేందుకు యత్నించారు. కానీ, ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో వాదన బలం పుంజుకుంటోందని గుర్తించిన నేతలు అధినేత బుజ్జగింపులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని సమాచారం. ‘ఇప్పుడు చంద్రబాబు అవసరం మాకు లేదు.. మా అవసరమే ఆయనకు ఉంది’.. అని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించడం టీడీపీలో భవిష్యత్‌ పరిణామాలను సూచిస్తోంది. ఈ పరిణామాలు టీడీపీలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top