సోనియా సంచలన నిర్ణయం.. జీ-23 నేతలకు కీలక పదవులు

Sonia Gandhi Key Decision Taken On Ghulam Nabi Azad - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని జీ–23 గ్రూప్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో సోనియా గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీలో భారీ ప్రక్షాళన, పలు అంశాలపై వీరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో కాంగ్రెస్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 

ఈ చర్చల్లో ఆజాద్‌ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు.. కర్నాటక ఎన్నికల తర్వాత ఆజాద్‌కు అక్కడి నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మను కూడా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడుగా ఉన్న మనీష్ తివారీకి ఏఐసీసీలో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సుముఖత చూపించారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, హుడా.. ప్రస్తుత హర్యానా పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు.  

ఇక, గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్న సోనియా.. సిబల్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఇరువురు నేతలు.. కాంగ్రెస్‌ “అసమ్మతి నేతల” అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్‌కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top