తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్‌.. హస్తం గూటికి ఇద్దరు సీనియర్లు! 

Senior Leaders May Join Congress In Telangana - Sakshi

కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద అప్పుడే ప్రసరిస్తోందా? గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలు హస్తం వైపు చూస్తున్నారా? కమలం పార్టీ కంటే హస్తం పార్టీయే బెటర్ అని కారు పార్టీ నేతలు భావిస్తున్నారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం పార్టీకే జై కొడతారా? లేక కాంగ్రెస్ మీద బీజేపీ రివెంజ్ తీర్చుకుంటుందా? ఇంతకీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్ ఎలా ఉండబోతోంది?..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తమ పార్టీలో చేరికలు ఊపందుకుంటాయని కొన్నాళ్ళుగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. మొన్నటి వరకు డీలా పడ్డ కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కర్ణాటక తర్వాత ఇక తెలంగాణలో అధికారం వచ్చేస్తుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్‌లోని అసమ్మతి నేతలంతా తమ పార్టీలోకే వస్తారని కూడా హస్తం పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాకముందు ఏ పార్టీలో చేరాలా అంటూ ఊగిసలాడిన గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలు ఇక కాంగ్రెస్‌లో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకులు వారితో చర్చలు జరిపారు. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న ఈ రెండు జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాగా ప్రభావం చూపగలుగుతారని భావిస్తూ చర్చలు జరుపుతున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించినందున ఇక పొంగులేటి, జూపల్లి దారి గాంధీభవన్ దిశగానే ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణాదిలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారడంతో కమలనాథులు కొంత డీలా పడ్డా తెలంగాణలో అదే రేంజ్‌లో రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ మొదలైంది. పక్క రాష్ట్రం ఫలితాల ఆధారంగా నిరాశకు గురికాకుండా దూకుడు పెంచి కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే గులాబీ పార్టీలోని అసంతృప్త నేతల్ని ఎలాగైనా తమ గూటిలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఏదేమైనా జూన్ మాసంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం ఊపందుకుంది. ఏదేమైనా తెలంగాణలో అధికార పార్టీలోని అసమ్మతి నేతలకు ప్రత్యర్థి పార్టీల నుంచి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. అంతిమంగా కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో బీజేపీ నేతలకు కొత్త టెన్షన్‌!
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top