
సాక్షి, గుంటూరు: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నాను. నాగమల్లేశ్వరరావు పైన జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నం. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయి. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. వైఎస్సార్‌సీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు. నాగమల్లేశ్వరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారు.
పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలేవి?. గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్‌పైన దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నాడు అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైఎస్సార్‌సీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే మామిడి యార్డు మూసివేశారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ఇది. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. అందుకే ప్రజలకు చెబుతున్నాం. వైఎస్సార్‌సీపీని చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారు. మిర్చి రైతుల కంట కన్నీరు కారుతుంది. ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

రైతులు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ అంటున్నాడు. ఆయన పోలీసా లేక రాజకీయనాయకుడా?. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటే అది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్దీ మేము రాటు తేలేలా చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు. అందుకే ఆయనొస్తే పది మంది బయటకు రావటం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. ప్రజల గురించి ఆలోచించడం జగన్‌కు అలవాటు. అందుకే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు.
టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. దాడులపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.