
సాక్షి,తాడేపల్లి: మా ఓపికను మీరు చేతగానితనంగా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం.వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారుల్ని సైతం విచారిస్తామని స్పష్టం చేశారు.
సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని నియంతృత్వం అనాలా..? ఏమనాలి.?. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీశారు. టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసులు కోసం వాడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తున్నందుకు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేశారు. టీడీపీ వాళ్ళు గుడివాడలో దారి కాసి గొడవలు చేశారు. పోలీసులు ఉండగానే గంటన్నర సేపు గుండాలు మహిళ జెడ్పి చైర్మన్‌పై దాడికి దిగారు. పోలీసులు రక్షణలో వాళ్ళు దాడులు చేశారు.కారుని పోలీసులు తాళ్ళు కట్టి తీసుకెళ్లాలని యత్నించారు.
పోలీసులు దాడి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. దాడులు జరపకుండా నిలువరించలేదు. తాము అధికారంలో ఉన్నామని,మా గురించి ఎవరు గొంతెత్తి మాట్లాడకూడదనిదాడులు చేస్తున్నారు.
పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ అందరూ చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై అక్రమ కేసు పెట్టారు. మాదాల సునీత అనే మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆమె ఫ్లెక్సీలు చించారు. గాయం అయితే కారుతో గుద్దినట్టు కేసు పెట్టారు. ఉప్పాల రాము వెనకాల సీట్లు కూర్చొని ఉంటే ఆయన గుద్దించినట్టు కేసు పెట్టారు.
ఎలాగైనా కేసులు పెడతాం అన్నట్టు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తున్నారు. హైకోర్టు అన్ని కోర్టులకు మెకానికల్‌గా రిమాండుకు పంపొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాలపై భయం లేకుండా ఇలాంటి కేసులు పెడుతున్నారు. వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు వేలాది మంది రైతులు వచ్చారు. దానికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వస్తే దాడి చేశారని కేసు పెట్టారు.
ఎఫ్ఐఆర్‌ని మార్చి మరి తప్పుడు కేసు పెట్టారు.నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. పోలీసులు ఉండగానే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు.వాళ్ళ ముందే వస్తువులను కాల్చారు. వారం రోజులైనా ఎవరిపైనా కేసు పెట్టలేదు.
ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తాడిపత్రిలో పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా నియోజకవర్గంలోకి రానివ్వలేదు. పొదిలి, బంగారు పాళ్యం అన్ని చోట్లా తప్పుడు కేసులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం. తప్పుడు కేసుల్లో ఉన్న అధికారుల పైన కూడా విచారిస్తాం. మా ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దుని సూచించారు.