నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

RS Praveen Kumar To Join BSP Today - Sakshi

నేడు నల్లగొండలో బీఎస్పీ బహిరంగ సభ

ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఎస్పీ నేషనల్‌ కోఆర్డినేటర్‌ రాంజీగౌతమ్‌

మర్రిగూడ బైపాస్‌ వద్ద స్వాగతానికి ఏర్పాట్లు

డప్పు, కోలాట కళాకారులతో 2 గంటలపాటు ర్యాలీ

4 గంటలకు బహిరంగ సభ ప్రారంభం 

నల్లగొండ: బహుజన సమాజ్‌పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో బహిరంగ సభ జరగనుంది. అందుకు జిల్లా పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాలనుంచి బహుజన సమాజ్‌పార్టీ కార్యకర్తలు, స్వేరోలు, ప్రవీణ్‌కుమార్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సాయంత్రం 4గంటలకు సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలిలో కూడా ప్రవీణ్‌కుమార్, ముఖ్య అతిథులతో కూడిన ఫొటోలతో భారీ కట్‌అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తలు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు.

బహుజన సమాజ్‌పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, ఆర్‌ఎస్‌పీ రాజకీయ సంకల్ప సభకు కన్వీనర్‌ పూదరి సైదులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ నేషనల్‌ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌ హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర , తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జ్‌లు, జిల్లాకు చెందిన బీఎస్‌పీ నేతలు కూడా హాజరుకానున్నారు.

బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్‌కుమార్‌...
నల్లగొండలో జరిగే  బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో అధికారికంగా చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన గురుకుల కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంతంగా పార్టీ పెడతరా లేదా ఇతర అధికార పార్టీలో చేరుతారన్న వదంతులు వచ్చాయి. కానీ, ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం నల్లగొండలో జరిగే  బహిరంగ సభలో బీఎస్‌పీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.

4 గంటలకు బహిరంగ సభ
బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 4గంటలకు ఎన్‌జీకళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగునుంది.  పోలీసులు కూడా సభాస్థలితో పాటు పార్కింగ్‌ తదితర వాటిని ఏర్పాట్లు చేశారు. అయితే బహిరంగ సభ రోజు ఉదయం డాన్‌బోస్కో నుంచి నల్లగొండ టౌన్‌లోకి 1000 మందితో ఫిట్‌ ఇండియా 5కే రన్‌ నిర్వహించనున్నారు. ఇదంతా స్వేరోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం మర్నిగూడ బైపాస్‌ నుంచి ర్యాలీ 
మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దెంకి బైపాస్‌ వద్ద ముఖ్య అతిథులకు కార్యకర్తలంతా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు , కోలాట కళాకారులతో ర్యాలీ ప్రారంభం కానుంది. రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత 4గంటలకు ఎన్జీ కాలేజీ సభ స్థలి చేరుకుంటారు.

కార్యకర్తలు స్వచ్ఛందంగా..
బహిరంగ సభకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయడం లేదు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అభిమానులు, స్వేరో కార్యకర్తలంతా స్వచ్ఛందంగానే  సభకు హాజరవుతారని జిల్లా ఇన్‌చార్జి సైదులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించబోతున్నాం. శానిటైజర్‌ , మాస్కులు తప్పనిసరి , సమావేశం పూర్తయిన తర్వాత కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సభ జరగనుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top